HCU Land Issue: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) పట్టు వీడటం లేదు. ఆ 400 ఎకరాల భూమి సర్కారుదేనని ప్రభుత్వం ప్రకటించగా, కాదు కాదు ఆ భూములు తమ యూనివర్సిటీ భూములేనని హెచ్‌సీయూ ప్రకటించింది. దీంతో వివాదం ముదిరిపాకాన పడేలా ఉన్నది. ఇప్పటికే ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన సర్కారు.. బుల్డోజర్లతో భూమిని చదును చేసే పనులను కొనసాగిస్తూనే ఉన్నది.
HCU Land Issue: ఈ దశలో హెచ్‌సీయూ విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. ఈ కేసు విచారణకు రాకముందే రాష్ట్ర ప్రభుత్వం చెట్ల తొలగింపు, భూమి చదును చేసే పనులను రేయింబవళ్లు కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులు దిగిరావడం లేదు. పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరుతున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులను కలిసి మద్దతు అడిగారు.
HCU Land Issue: ఇదే దశలో ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఆ భూముల్లో హెచ్‌సీయూకి అంగుళం భూమి లేదని తేల్చి చెప్పింది. కోర్టులోనూ ఆ భూమి తమదేనని తేలిందని ప్రభుత్వం తెలిపింది. 21 ఏండ్ల క్రితం ప్రైవేటు సంస్థకు భూమి కేటాయించారని, న్యాయపోరాటంతో ఆ భూమిని ప్రభుత్వం దక్కించుకుందని తెలిపింది. అభివృద్ధి పనులతో అక్కడి రాళ్లను దెబ్బతీయవని, అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేనే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏంచేసినా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని, కొందరు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని అధికారిక ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది.
HCU Land Issue: తెలంగాణ ప్రభుత్వ ప్రకటనపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) కూడా స్పందించింది. ఈ మేరకు ప్రతిగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రకటనను హెచ్‌సీయూ తీవ్రంగా ఖండించింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ఎట్టిపరిస్థితుల్లో తమదేనని స్పష్టంచేస్తూ హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024 జూలైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఇప్పటివరకు భూమి ఎలా ఉన్నదన్న దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని ఆ ప్రకటనలో తెలిపారు.
హద్దులకు అంగీకారం తెలిపినట్టు టీజీఐఐసీ చేసిన ప్రకటనను తాము ఖండిస్తున్నట్టు హెచ్‌సీయూ రిజిస్ట్రార్ తెలిపారు. ఇప్పటివరకు ఆ భూమికి హద్దులే నిర్ణయించలేదని, దీనికి తమకు సమాచారం ఇవ్వనేలేదని పేర్కొన్నారు. ఆ భూమిని యూనివర్సిటీకి ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నామని, భూమి కేటాయింపుతోపాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు.

