Kambala Ramasena

Kambala Ramasena: బీజేపీలో ఎంట్రీ తర్వాత కంబాల గ్రాఫ్‌ పెరిగిందా?

Kambala Ramasena: తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి, సాధారణ వ్యాపారిగా జీవనం కొనసాగించి.. ఉన్నత చదువుల నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్లి.. మానవత్వాన్ని చదివి, తోటి మనిషిలో కష్టాన్ని గుర్తించి.. తిరిగి అదే గ్రామంలో మానవతా దృక్పథంతో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్. గోకవరం నుండి ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్లిన కంబాల శ్రీనివాస్‌.. అక్కడ కెరీర్‌ పరంగా ఘన విజయాలు సాధించి, ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నారు. అయితే తనకున్న దాంతో ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని ఎప్పటి నుండో తన మనసులో ఉన్న కోరికతో, అదే మాదిరిగా తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో పాటుగా… హిందూ ధర్మ పరిరక్షణకు, ఆలయాల అభివృద్ధికి ఏదైనా చేయాలన్న లక్ష్యంతో తిరిగి గోకవరం గ్రామానికి చేరుకున్నారు.

రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందిన కంబాల… తొలుత సీఎండీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇక అక్కడ నుండి ప్రజా సేవలో ఆయన ప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు. మన కృషితో పాటు దైవ సంకల్పం తోడైతే.. మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదు అనడానికి కంబాల శ్రీనివాస్‌ ఒక నిదర్శనం అని చెప్తుంటారు ఆయన సన్నిహితులు. గోకవరం గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనేది కంబాల సంకల్పం. అదే గ్రామంలో దేవి చౌక్ అమ్మవారి ఆలయానికి బంగారు కిరీటం, బంగారు చీర సమర్పించడంతో పాటు.. సత్యనారాయణ స్వామి ఆలయ గోపురం నిర్మాణంతో తన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు నాంది పలికారట కంబాల శ్రీనివాస్‌.

ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో పులిహోర వితరణతో పాటు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు పండ్లు, పాలు, రొట్టెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. ఇక మండలంలో జరిగే అన్నదానాలకు తమ పూర్తి ఆర్థిక సహకారాన్ని అందించడం ఆనవాయితీగా పెట్టుకున్నారట. కంబాల ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు మంచి గుర్తింపు రావడంతో… ఇటు జగ్గంపేట, అటు రాజానగరం, రంపచోడవరం నియోజవర్గాల ప్రజలు.. తమ ప్రాంతాల్లోనూ ఆలయాల అభివృద్ధికి సహకరించాలంటూ ప్రతినిత్యం కంబాలను కలుస్తూ ఉంటారు. అలా వచ్చిన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు తక్కువ కాకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఆలయాల అభివృద్ధికి తోడ్పడ్డారంట కంబాల.

Kambala Ramasena: మరోపక్క చిన్న పిల్లలకు సంగీతం, భరత నాట్యాలను మినిమం ఫీజుతో, అనుభవజ్ఞులైన గురువులతో క్లాసులు ప్రారంభించి అతి సామాన్య కుటుంబాలలోని చిన్నారులు సైతం కళలలో రాణించేందుకు శిక్షణ ఇప్పిస్తున్నారట. ఇక మహిళలకు ఒక కుటుంబ సభ్యుడిగా.. శ్రావణమాసం బంగారు రూపులను గ్రామ గ్రామాల్లో డ్రాలు కండెక్ట్‌ చేసి ఉచితంగా అందిస్తూ వస్తున్నారట. ఇక చుట్టుపక్కల ఎక్కడ ఆలయం కడుతున్నా, ఏ ఆలయానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలైనా, అన్నదానం నిర్వహించాలన్నా సీఎండీ లేఔట్‌లో ఆయన్ని కలిస్తే చాలు, వెంటనే అక్కడక్కడికే వారికి తగినంత ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు… ఇటువంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాల్సి వస్తే.. తన వంతు సాయం అందిస్తానని వాళ్లకి అభయం ఇచ్చి పంపిస్తారట కంబాల.

తమకు ఏ కష్టం వచ్చినా కంబాలను కలిస్తే చాలు.. ఎంతో కొంత సహకారం అందుతుందని సామాన్య ప్రజలు ఆయన దగ్గరికి క్యూ కడుతుండటం ప్రతి రోజూ చూడొచ్చు. అనారోగ్యంతో వచ్చి ఆయనను కలిస్తే స్పాట్లో వాళ్ల పరిస్థితిని బట్టి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అవసరమైతే హాస్పిటల్‌కి నేరుగా ఆయనే ఫోన్ చేసి వైద్యం అందే చర్యలు ఎన్నో చేపట్టారట. ఇక భర్త లేని మహిళల కుటుంబాలకు ఆసరాగా ప్రతినెలా 25 కేజీల బియ్యం ఉచితంగా తన సిబ్బందితో పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట కంబాల.

Also Read: Massive Earthquake: బాబా వంగా చెప్పిన జోస్యం నిజ‌మ‌వుతుందా? మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్ విప‌త్తుపై ముందే చెప్పారా?

Kambala Ramasena: కంబాల శ్రీనివాస్ చేసే కార్యక్రమాలు, ప్రజల్లో పొందుతోన్న ఆదరణ చూసి.. భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆయనకి పిలుపు రావడంతో మంచి ముహూర్తం కోసం ఎదురు చూశారు. గత శ్రీరామనవమికి భారీ ఎత్తున గ్రామ గ్రామాల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో పాటు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి, తన స్వహస్తాలతో బంగారు కిరీటాన్ని అందించారు. అదే రోజు బీజేపీ ఏపీ చీఫ్‌, ఎంపీ పురంధేశ్వరి.. ఇతర పెద్దల సమక్షంలో బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు కంబాల శ్రీనివాస్‌. ఒకపక్క రామసేన కార్యక్రమాలు చేస్తూనే… మరో ప్రక్క భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం బీజేపీ బలపడే విధంగా అను నిత్యం చేరికలు, పార్టీ కార్యక్రమాలతో పాటు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ.. బీజేపీ అంటే భారతీయుల పార్టీ అని అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేస్తూ.. జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో రాజకీయంగా బీజేపీని బలపరిచారు.

ఏ పదవి లేకుండానే సొంత డబ్బులతో తమ వర్గంతో, తమ సిబ్బందితో ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకు వెళ్తూ, రాబోయే రోజుల్లో ఒక రాజకీయ ఐకాన్‌గా మారుతున్న కంబాల శ్రీనివాస్ లాంటి నాయకుడు ప్రజా ప్రతినిధి అయితే.. గ్రామాల రూపు రేఖలు మారి, అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తాం అంటూ అక్కడి వివిధ వర్గాలు, పేద ప్రజల్లో ఓ ఆకాంక్ష వ్యక్తమవుతోందట. చూడాలి మరి.. ఈ ఆధ్యాత్మికవేత్త, రాజకీయ ఐకాన్.. మున్ముందు ఇంకేం చేయబోతున్నారో.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *