Harish Rao: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పై న్యాయ విచారణ వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే ఇంజనీరింగ్, నిర్మాణాల స్థాయిలో విచారణను పూర్తిచేసిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని న్యాయ విచారణ కమిషన్… ఇప్పుడు నాటి రాజకీయ నేతలపై దృష్టి పెట్టింది. తాజాగా నీటిపారుదలశాఖ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(Harish Rao) సోమవారం కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.
ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో కమిషన్ ఎదుట హరీష్ రావు హాజరవుతారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో తలెత్తిన లోపాల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగిపోవడం, ఇతర బ్యారేజీల నిర్మాణాలలో వైఫల్యాలు వెల్లడి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం 2023లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి: Gold Rate Today: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులు విచారణకు హాజరయ్యారు. ఇటీవలే మాజీ ఆర్థికశాఖ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కమిషన్ ప్రశ్నించింది. ఇక జూన్ 11న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కూడా హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు హరీశ్ రావు హాజరవుతుండటంతో కమిషన్ కార్యాలయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.
ప్రాజెక్టు మొత్త వ్యయాలు, నిర్మాణ లోపాలు, పునఃసమీక్ష అవసరం వంటి అంశాలపై కమిషన్ సమగ్రంగా విచారణ జరుపుతోంది. ఈ విచారణ నివేదిక రాష్ట్ర పాలనపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, రాజకీయంగా ఇది కీలక మలుపుగా మారబోతోందని భావిస్తున్నారు.
తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు