MK Stalin

MK Stalin: కూలిపోనున్న విజయ్ ప్రభుత్వం?.. డీఎంకే క్యాడర్‌కు స్టాలిన్ సంచలన పిలుపు!

MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం సాగదని, ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో డీఎంకే నాయకులు, కార్యకర్తలు ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఎదుర్కొన్న ఓటమి కేవలం తాత్కాలికమేనని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే తమిళనాడు అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చని, ఆ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో సూర్యుడు ఎప్పటికీ అస్తమించడని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

మరోవైపు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. కేవలం ఓటమితోనే ఆగిపోకుండా.. అసలు పార్టీ ఎందుకు ఓడిపోయింది? ప్రజలు ఎందుకు దూరం పెట్టారు? అనే విషయాలపై లోతుగా విశ్లేషించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్ సేకరించడం కోసం 36 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తప్పులను సరిదిద్దుకుని, రాబోయే ముందస్తు ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా డీఎంకే అడుగులు వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *