Medical Shops: మందులు కొనుగోలు చేసే వారికి అత్యవసర అలర్ట్. మే 20వ తేదీ బుధవారం నాడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతబడనున్నాయి. ఆన్లైన్ (ఈ-ఫార్మసీ) ద్వారా మందుల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఈ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా మద్దతు తెలుపుతూ రేపు జంట నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు దిగుతున్నాయి.
పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భారీ డిస్కౌంట్లు ఇస్తూ మందులు అమ్ముతుండటం వల్ల, నగరాల్లోని స్థానిక ఫార్మసీలతో పాటు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా నడుస్తున్న చిన్న చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. శ్రీధర్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమ మనుగడ కోసమే చేస్తున్న పోరాటమని ఆయన పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ మందుల అమ్మకాల కోసం తెచ్చిన తాత్కాలిక నిబంధనలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ వ్యాపారులందరికీ సమాన అవకాశాలు ఉండేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అయితే, ఈ ఒక్కరోజు మెడికల్ షాపుల బంద్ కారణంగా రోగులకు, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మందులు లభించేలా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో కౌంటర్లు తెరిచి ఉంచుతామని తెలిపారు. ఏదేమైనప్పటికీ, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటానికి తమకు అవసరమైన అత్యవసర మందులను ఈరోజే ముందే కొని దగ్గర పెట్టుకోవడం మంచిది.
