Harish Rao: హోలీ పర్వదిన సందర్భంగా అందరూ ఇండ్లల్లో రంగులు చల్లుకుంటూ ఆనందం పంచుకుంటుంటే, తమ ఇళ్లలో నిజమైన పండుగకు కారణమైన బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావును వెతుక్కుంటూ వచ్చి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు కొందరు హైడ్రా బాధితులు. హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసి, జనజీవనాన్ని స్తంభింప చేసిన హైడ్రా కూల్చివేతలతో ఎందరో నిరాశ్రయులయ్యారు. మరెందరో వ్యాపారులు నిట్టనిలువునా కూలి పేదరికంలోకి వెళ్లారు. అయితే ఈ హైడ్రా కొన్ని కాలనీల్లో దీర్ఘకాల సమస్యలను తీర్చిందనడంలో సందేహం లేదు.
Harish Rao: అయితే ఈ హోలీ సందర్‌భంగా హైదరాబాద్ నగర పరిధిలోని హైదర్షాకోట్ డ్రీమ్ హోమ్ కాలనీవాసులు మాత్రం తమ ఇండ్ల కూల్చివేతలను అడ్డుకున్న హరీశ్‌రావు వద్దకు వచ్చి సంతోషం పంచుకున్నారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీశ్‌రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీవాసులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
Harish Rao: హైడ్రా కూల్చివేతలతో తమ సొంతిళ్లను కోల్పేయే పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు ఐదు నెలల క్రితం తెలంగాణ భవన్‌కు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. హరీశ్‌రావు వారి సమస్యను అర్థం చేసుకొని స్వయంగా కాలనీకి వెళ్లి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు. బాధితుల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను నిలదీశారు. తాము ఆపదలో ఉన్నప్పుడు హరీశ్‌రావు తమకు అండగా నిలిచారని, ఈ సాయం తాము ఎప్పటికీ మరిచిపోలేమని కాలనీవాసులు ఈ సందర్భంగా చెప్పారు. హరీశ్‌రావుకు అందరూ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు తినిపించి సంతోషం పంచుకున్నారు.

