Harish Rao: తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ మళ్లీ రాజకీయ దుమారం ముమ్మరంగా మారుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా ఈ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో 650 పేజీల కమిషన్ నివేదికపై పూర్తి స్థాయి చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
హరీష్ రావు మాట్లాడుతూ, “ప్రభుత్వం నుంచి నిజాలు బయటకు రావాలంటే, అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరపాలి. అప్పుడు ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజలకు స్పష్టంగా చూపించగలం,” అని అన్నారు.
తెలంగాణ భవన్‌లో ఆయన ప్రత్యేకంగా వీడియో ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా, కాళేశ్వరం కమిటీ ఇచ్చిన నివేదిక నిజమైతే, కేంద్ర ప్రభుత్వానికే ప్రధాన బాధ్యత అంటూ విమర్శించారు. “కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతులు ఇచ్చింది కేంద్రమే కదా. ఇప్పుడు అదే కేంద్రాన్ని తప్పుబట్టే నివేదిక ఎలా వస్తుంది?” అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Young Tiger NTR: ఎన్టీఆర్ సరికొత్త రికార్డు: ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పై తొలిసారి
హరీష్ రావు పోలవరంతో కూడా పోలికలు పెట్టారు. “ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు కూలినా, కేంద్ర నదీజల సంస్థ (NDSA) ఒక్కసారైనా అక్కడికి వెళ్లలేదని చెప్పారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ విషయంలో మాత్రం విచిత్రంగా, మూడు సార్లు ముందుగానే వచ్చి నివేదికలు ఇచ్చిందని విమర్శించారు.”
ఇక ఈ కమిషన్ ఏర్పాటుపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. “బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందు, ఎన్నికలకు ముందు, కేంద్ర నివేదికలు రావడం కేవలం రాజకీయ కుట్రల భాగమే. స్థానిక సంస్థల ఎన్నికల ముందు మళ్లీ కమిషన్ పేరుతో పాత నాటకం తిరిగి ఆడుతున్నారు” అన్నారు.
అంతేకాదు, మాజీ సీఎం కేసీఆర్ గారికి, తనకు ఎలాంటి నోటీసులు రాకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.