New GST Slabs: దేశ ప్రజలకు ఊహించని గుడ్‌న్యూస్‌ను అందించింది కేంద్ర ప్రభుత్వం. పన్ను విధానాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం, వస్తు సేవల పన్ను (GST) వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేసింది. ఇకపై జీఎస్టీలో కేవలం రెండు శ్లాబ్‌లు మాత్రమే కొనసాగనున్నాయి—5 శాతం మరియు 18 శాతం. విలాస వస్తువులు మాత్రం 40 శాతం పన్ను కిందనే ఉండనున్నాయి. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయి.
ఆరోగ్య, విద్యా రంగాలకు పెద్ద ఊరట
కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం, ఆరోగ్యరంగంలో 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించబడింది. లైఫ్, హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు, వ్యక్తిగత బీమాలకు కూడా పన్ను మినహాయింపు లభించింది. విద్యార్థుల కోసం మ్యాప్‌లు, చార్ట్స్, గ్లోబ్స్, పెన్సిల్స్, షార్ప్నర్స్, నోట్‌బుక్స్ వంటి వస్తువులపై జీఎస్టీ పూర్తిగా ఎత్తేశారు.
5 శాతం జీఎస్టీ కిందకి వచ్చినవి
నిత్యావసరాలు, వ్యవసాయ పరికరాలు, పిల్లల ఉత్పత్తులు, డైరీ ప్రొడక్ట్స్ వంటి వస్తువులు ఇకపై 5 శాతం జీఎస్టీ కిందకి వస్తాయి.
-
హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్, సబ్బులు, టూత్‌బ్రష్‌లు, షేవింగ్ క్రీమ్
-
బటర్, నెయ్యి, చీజ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఐస్‌క్రీమ్, చాక్లెట్స్
-
చిన్నపిల్లలకు నాప్కిన్లు, ఫీడింగ్ బాటిల్స్, డైపర్లు
-
బయో పెస్టిసైడ్స్, బిందు సేద్య పరికరాలు, ట్రాక్టర్ విడిభాగాలు
-
సైకిల్స్, ప్యాకేజ్డ్ బ్రెడ్, రోటి, పరోటా
-
మెడికల్ పరికరాలు, కళ్లద్దాలు
ఇది కూడా చదవండి: Ration Shop: రేపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్..
18 శాతం జీఎస్టీ కిందకి వచ్చినవి
ఇప్పటివరకు 28 శాతం జీఎస్టీ ఉన్న అనేక వస్తువులు ఇప్పుడు 18 శాతం పన్ను కిందకి వచ్చాయి.
-
సిమెంట్, టూవీలర్స్, త్రీవీలర్స్, చిన్న కార్లు (350 సీసీ కంటే తక్కువ)
-
ఏసీలు, టీవీలు, మానిటర్స్, ప్రొజెక్టర్లు
-
క్లీనింగ్ ప్రొడక్ట్స్, డిష్‌వాషింగ్ మెషీన్స్
40 శాతం పన్ను కొనసాగేవి
విలాస వస్తువులు, పొగాకు ఉత్పత్తులపై మాత్రం పన్ను తగ్గింపు లేదు.
-
1200 సీసీ పైబడిన పెట్రోల్ కార్లు, 1500 సీసీ పైబడిన డీజిల్ కార్లు
-
పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు
-
లాటరీలు, క్యాసినోలు, ఆన్లైన్ మనీ గేమ్స్, గుర్రపు పందేలు
‘గేమ్ ఛేంజర్ రీఫార్మ్’ అంటున్న కేంద్రం
ఈ సంస్కరణలు రైతులు, పేదలు, మధ్యతరగతికి ఊరట కలిగించేలా రూపొందించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఈ జీఎస్టీ మార్పులు ఉంటాయని చెప్పారు. “వ్యవసాయం, ఆరోగ్యరంగాల్లో ఇవి గేమ్ ఛేంజర్ అవుతాయి” అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
🔹 సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి.
🔹 రెండు ప్రధాన స్లాబ్‌లు మాత్రమే: 5% మరియు 18%.
🔹 విలాస వస్తువులు 40% పన్ను కిందనే కొనసాగుతాయి.

