Blue Flag Status: విశాఖపట్నం రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయిన నేపథ్యంలో, సంబంధిత అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో, ఇప్పటి వరకు పర్యాటక శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా (ఆర్జేడీ) పనిచేసిన రమణ, జిల్లా టూరిజం అధికారి కె. జ్ఞానవేణిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
కొత్త అధికారుల నియామకం
పర్యాటక శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా గేదెల జగదీష్‌ను, జిల్లా పర్యాటక అధికారిగా జి. దాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. రుషికొండ బీచ్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులను కూడా బాధ్యతల నుంచి తప్పించింది. బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోవడానికి కారణమైన అధికారుల మధ్య సమన్వయ లోపంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పనిచేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Dhananjay Munde Resigned: మంత్రి ధనంజయ్ ముండే అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారు?
నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా హోదా కోల్పాటు
2020లో రుషికొండ బీచ్ 600 మీటర్ల విస్తీర్ణంలో బ్లూ ఫ్లాగ్ హోదాను పొందింది. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (FEE) ఈ గుర్తింపును అందజేస్తుంది. అయితే, ఇటీవల బీచ్‌లో పరిశుభ్రత కొరవడి, శునకాలు ప్రవేశించడం, సీసీ కెమెరాలు పని చేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, నడక మార్గాలు ధ్వంసం కావడం వంటి సమస్యలు తీవ్రంగా కనిపించాయి. అదనంగా, మూత్రశాలలు మరియు దుస్తులు మార్చుకునే గదులు జాగ్రత్త లేకుండా వదిలిపెట్టడం వంటి కారణాల వల్ల హోదా రద్దు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాలపై డెన్మార్క్ సంస్థకు ఫిర్యాదులు వెళ్లడంతో, ఫౌండేషన్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా ఉపసంహరించుకుంది.
ప్రభావిత కాలం
ప్రతి ఏడాది సెప్టెంబర్ నుంచి మార్చి వరకు బ్లూ ఫ్లాగ్ సీజన్‌గా గుర్తించబడుతుంది. ఈ సమయంలో బీచ్‌పై బ్లూ ఫ్లాగ్‌ను ఎగుర వేయాల్సి ఉంటుంది. అయితే, గుర్తింపు తాత్కాలికంగా రద్దయిన కారణంగా బ్లూ ఫ్లాగ్‌ను తొలగించాల్సి వచ్చింది. 2024-25 సంవత్సరానికి అక్టోబరులో పునరుద్ధరించబడిన హోదా మళ్లీ కోల్పోవడం పర్యాటక రంగానికి పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో రుషికొండ బీచ్ నిర్వహణలో కొత్త మార్పులు వచ్చి, త్వరలోనే బ్లూ ఫ్లాగ్ హోదాను తిరిగి పొందే అవకాశముందని అధికార వర్గాలు తెలియజేశాయి.