High Court: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సంచలన కౌంటర్ దాఖలు చేసింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా దాఖలు చేసిన ఈ కౌంటర్లో, ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్లలో కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
కమిషన్ నిర్ధారణలు, ప్రభుత్వ ఆరోపణలు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లో, జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ధారించిన కీలక అంశాలను వివరించారు:
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలం ఎంపిక, నిర్మాణం, డిజైన్ ఖరారు మరియు నిర్వహణలో నాటి సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు.
కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పించడానికి ప్రాజెక్టుల అంచనా విలువను పెంచారు. అంచనా విలువ రూ.1,942.48 కోట్లు పెంచడం వల్ల కాంట్రాక్టర్లకు రూ.612.51 కోట్ల అక్రమ ప్రయోజనం కలిగిందని కమిషన్ తేల్చింది.
ఇది కూడా చదవండి: Delhi: బాబ్రీ మసీదు వార్షికోత్సవం రోజున దేశవ్యాప్త దాడులకు ప్రణాళిక
మంత్రి మండలి ఆమోదం లేకుండానే పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేశారు. మంత్రిమండలి ఆమోదం పొందినప్పుడే సమిష్టి బాధ్యత అవుతుందని, కేసీఆర్ ఏకపక్షంగా అనుమతులు మంజూరు చేయడంతో బాధ్యత నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు.
ప్రభుత్వం జీవో ద్వారా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి బ్యారేజీల నిర్మాణాన్ని చేపట్టారని, దీనివల్లే రూ.7,500 కోట్ల భారం పడిందని ప్రభుత్వం తెలిపింది.
సీబీఐ దర్యాప్తు అవసరం
బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు అనంతరం నిజమైన నేరం వెలుగులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడం, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికలో లోపాలున్నాయని చెప్పడంతోనే కమిషన్‌తో విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
విచారణపై కేసీఆర్ వాదన చెల్లదు
విచారణ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగం ప్రకారమే జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కమిషన్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న వాదనలను కౌంటర్లో ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది:
కేసీఆర్ విచారణకు స్వచ్ఛందంగా హాజరయ్యారని, ఆయన అభ్యర్థన మేరకు ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్ కూడా చేపట్టారని తెలిపింది. అన్ని పత్రాలు పొందిన తర్వాత ఇప్పుడు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా విచారణ జరిగిందనడం చెల్లదని పేర్కొన్నది.
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టంలోని సెక్షన్ 8ఏ, సీ కింద నోటీసులకు సంబంధించిన హక్కులను విచారణ సమయంలో వదులుకొని, ఇప్పుడు వాటిని సవాలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నిష్పాక్షికంగా విచారణ జరిపి, ఆధారాలతో సహా నివేదిక సమర్పిస్తే, దానిని కేవలం ‘రాజకీయ వ్యూహం’ అని కేసీఆర్ ఆరోపించడం సరికాదని ప్రభుత్వం పేర్కొంది.
చివరగా, రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం కలిగించిన అంశాలపై కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసి, స్టేను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును అభ్యర్థించింది.

