Karimnagar

Karimnagar: స్నేహితుల మోసంతో డాక్టరు బలవన్మరణం.. తీర్చలేని అప్పులు, బెదిరింపులతో విషాదం..

Karimnagar: స్నేహితులు తీసుకున్న భారీ అప్పులు తిరిగి చెల్లించకపోవడం, ఆపై బెదిరింపులకు పాల్పడటంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురైన ఓ యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణలో కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనలో కరీంనగర్‌లోని ప్రతిమ వైద్య కళాశాలలో అనస్థీషియా పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఎంపటి శ్రీనివాస్ (42) బలవన్మరణానికి పాల్పడ్డాడు. డాక్టర్‌ శ్రీనివాస్ తన స్నేహితులు నలుగురికి, మరొక వ్యక్తికి భారీ మొత్తంలో అప్పులు ఇప్పించారు. కరీంనగర్‌కు చెందిన వింజనురి కరుణాకర్ అనే వ్యక్తికి రూ.1.50 కోట్లు, ముగ్గురు స్నేహితులు (కిరణ్, కవిత, వెంకట నరహరి) కలిసి రూ.1.35 కోట్ల బ్యాంకు రుణం, అలాగే బంజేరుపల్లికి చెందిన కుమారస్వామి తన వ్యాపారం కోసం రూ.28 లక్షలు శ్రీనివాస్ ద్వారా అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తీసుకున్న స్నేహితులు ఎవరూ తిరిగి చెల్లించకపోవడంతో, అప్పుల భారం మొత్తం శ్రీనివాస్‌పై పడింది.

అప్పుల బాధతో ఆత్మహత్య
శ్రీనివాస్ తన అప్పులను తీర్చలేక, ముఖ్యంగా బ్యాంక్ ఈఎంఐలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై బ్యాంకు అధికారులు కూడా ఒత్తిడి పెంచారు. ఈ బాధను తట్టుకోలేక, అప్పు తిరిగి ఇవ్వమని స్నేహితులను అడిగితే, వారు శ్రీనివాస్‌ను బెదిరించడం మొదలుపెట్టారు. స్నేహితుల తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, తాను చదువుతున్న వైద్య రంగానికి చెందిన అనస్థీషియా ఇంజక్షన్‌ను అధిక మోతాదులో తీసుకున్నారు. వెంటనే అపస్మారక స్థితిలోకి చేరుకున్న శ్రీనివాస్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. కష్టపడి డాక్టరు చదివిన కుమారుడు ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పు తీసుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *