GHMC: రోడ్డుపై చెత్త వేస్తున్నారా? మీకు ఎనిమిది రోజులపాటు జైలు శిక్ష ఖాయం.. ఈ విషయంతో తస్మాత్ జాగ్రత్త. ఇది ఎక్కడనుకుంటున్నారా? మన రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్లోనే ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని నగర పోలీసులు నిర్ణయించారు. దీంతో ఇక నుంచి ఎవరైనా చెత్తను రోడ్లపై పారబోయాలంటే జాగ్రత్తలు పడాల్సిందేనని గుర్తించారు. సెక్షన్70 (బీ), 66 సీపీ యాక్ట్ కింద రోడ్డుపై చెత్త వేశారన్న అభియోగాలు రుజువైతే జైలుకెళ్లడం ఖాయం చేయనున్నారు.
GHMC: జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో హైదరాబాద్ నగర పోలీసులు ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించారు. నగరంలో చెత్త వేసే వారున్న ప్రాంతాలను గుర్తించి, నిఘా ఏర్పాటు చేసి, చెత్త వేస్తున్న హాట్స్పాట్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో చెత్త వేసే వారిని కట్టడి చేయాలన్నది వారి ఉద్దేశం.
GHMC: ఇటీవల బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలో చెత్తను వేస్తున్న ఐదుగురిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా, రూ.1,000 జరిమానా విధించింది. చట్టంలో ఉన్న ఇతర సెక్షన్ల ప్రకారం 8 రోజుల వరకు నిందితులను జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చూశారా? ఇక రోడ్లపై చెత్తను పారవేసే వారు జాగ్రత్త పడాల్సిందేనన్నమాట.