Game Changer Review: అసలే సినిమా ఇండస్ట్రీ వివాదాల్లో విహరిస్తోంది. గతేడాది చివరలో వచ్చిన చిక్కులను తప్పించే సినిమా ఒకటి పడితే అంతా సర్దుమణిగిపోతుందని ఇండస్ట్రీ మొత్తం భావిస్తోంది. ప్రేక్షకులు కూడా అదే అనుకుంటున్నారు. ఐదేళ్ల తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోలో హీరోగా.. ఇండియన్ గ్రాండియర్ సినిమా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా వస్తోంది అంటే మొదట్లో బీభత్సమైన హైప్ ఉండేది. కానీ, భారతీయుడు 2 ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా శంకర్ ఫేట్ ఛేంజ్ అయిపొయింది. ఈ సినిమాపై నమ్మకాలు కూడా అందరికీ పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా పాటలు.. ట్రైలర్స్ మెల్లగా సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ ఏడాది మొట్టమొదటి బ్లాక్ బస్టర్ రాబోతోంది అనిపించింది అందరికీ. మరి గేమ్ ఛేంజర్ ఆ రేంజ్ సినిమా అయిందా? ఈరోజు అంటే జనవరి 10న సంక్రాంతి బరిలో తోలి సినిమాగా విడుదలైన గేమ్ ఛేంజర్ లో శంకర్ మ్యాజిక్ రిపీట్ అయిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
ఏ సినిమాకైనా బలమైన కథ.. అంతకు మించిన బిగువైన స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. ఆ రెండిటిలో ఏది వీక్ అయినా.. పెద్దగా పట్టదు. ఒక్కోసారి మామూలు కథ కూడా కథనంతో అద్భుతమైన సినిమాగా నిలబడుతుంది. ఇదంతా ఎందుకంటే.. కథ, కథనాలతో అద్భుతాలు చేసిన శంకర్ ఇప్పుడు ఎక్కడో ఆగిపోయినట్టు కనిపించింది. రామ్ చరణ్ లాంటి హీరోతో సినిమా చేస్తున్నపుడు సినిమాలో ఉండాల్సిన అసలు ఆత్మను మర్చిపోతే అది గేమ్ ఛేంజర్ అవుతుంది. సాదా సీదా.. ఎన్నోసార్లు వెండితెరపై చూసిన కథ.. దాదాపుగా అన్నిసార్లు సూపర్ హిట్స్ అందించిన కథ.. కానీ, గేమ్ చెంజర్ లో ఆకట్టుకోలేకపోయింది.
ఇది కూడా చదవండి: Game Changer Twitter Review: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
Game Changer Review: తనకున్న కోపం అనే బలహీనతను తగ్గించుకుని ప్రేయసి కోసం ఐఏఎస్ అయిన ఒక యువకుడు.. అనుకోకుండా రాజకీయ చట్రంలోకి వస్తాడు. అక్కడ అధికారం కోసం తండ్రినే చంపేసే కొడుకులకు.. ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు మధ్యలో ఘర్షణ మొదలవుతుంది. వ్యవస్థలతో ఆడుకునే రాజకీయ నాయకుడికి కొరుకుడు పడని ఆ ఆఫీసర్ నే అతని తండ్రి చీఫ్ మినిష్టర్ చేయాలని చివరి కోరికగా ప్రజల మధ్యలో చెబుతాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు-ఐఏఎస్ ల మధ్య నేరుగా వార్ స్టార్ట్ అవుతుంది. వీరిద్దరి మధ్య ఏమి జరిగింది? అసలు ఈ ఐఏఎస్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఎందుకనుకున్నారు? మరి ఈ యువకుడు ముఖ్యమంత్రి కాగలిగాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే గేమ్ ఛేంజర్.
అధికారులు-రాజకీయ నాయకులు ఇద్దరి మధ్య ఘర్షణ ఎన్నో సినిమాల్లో చూసాం. అయితే, శంకర్ సినిమా కదా ఇందులో ఏదైనా కొత్తదనం ఉంటుందేమో అనుకుంటే, అది కాస్తా నిరాశ అయిపోతుంది. రామ్ చరణ్ రెండు పాత్రల్లో.. మూడు షేడ్స్ తో ఒక రేంజ్ పెరఫార్మెన్స్.. అంజలి అద్భుత అభినయం.. సూర్య తిరుగులేని విలనిజం.. శ్రీకాంత్ సెటిల్డ్ యాక్షన్.. ఇన్ని హంగులున్నా అసలు కోల్పోవడంతో నిరాశ పరిచింది.
Game Changer Review: ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తీయడంలో శంకర్ స్పెషాలిటీ వేరు. అలాగే, గేమ్ ఛేంజర్ లో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ, అంత బలమైన ఫ్లాష్ బ్యాక్ ను ఎలివేట్ చేసేలా మిగిలిన సన్నివేశాలు కనిపించలేదు. అక్కడక్కడా మెరుపులు రెండున్నర గంటల సినిమాను నిలబెట్టలేవు కదా. ఐఏఎస్ లకు సంబంధించి కొన్ని డైలాగులు.. రామ్ చరణ్ యాక్టింగ్, అంజలి నటన.. సూర్య పెరఫార్మెన్స్ తోనే ఈ సినిమా కాస్తలో కాస్త నయం అనిపిస్తుంది.
టెక్నీకల్ గా సినిమా చాలా బావుంది. గ్రాండ్ విజువల్స్.. శంకర్ మార్క్ పాటలు.. అన్నీ చక్కగా కుదిరాయి. మొత్తమ్మీద చూసుకుంటే, సినిమా సో సో అనిపిస్తుంది. సంక్రాంతికి అందరూ ఎదురు చూసిన రేంజ్ లో సినిమా లేదని మాత్రమే చెప్పవచ్చు. రామ్ చరణ్ ఎంత కష్టపడినా.. ఇంటర్వెల్ బ్యాంగ్.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పితే సినిమాలో చెప్పుకోదగ్గ విషయం లేకపోవడమే బ్యాడ్!
చివరిగా ఇప్పుడు సినిమా అంటే హీరో ఎలివేషన్.. పట్టున్న స్క్రీన్ ప్లే.. గట్టి డైలాగులు.. ఇవన్నీ కుదరకపోతే అది గేమ్ ఛేంజర్ ఎలా అవుతుంది?
గమనిక: ఈ రివ్యూ రివ్యూయర్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మహా న్యూస్ సినిమా చూడాలని లేదా చూడవద్దని ఎటువంటి సూచనలు చేయడం లేదు.