Gold Price Today: బంగారం అంటే మన భారతీయులకు కేవలం అలంకారం మాత్రమే కాదు, అదొక భరోసా. కష్టకాలంలో ఆదుకునే ఆపద్బాంధవుడిగా పసిడిని భావిస్తారు. అందుకే ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. అయితే గత ఏడాది కాలంగా అమాంతం పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన బంగారం ధరలు, మంగళవారం నాడు స్వల్పంగా తగ్గి కాస్త ఊరటనిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న మార్పుల వల్ల హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో ధరలు భారీగా పెరగకుండా, స్వల్పంగానైనా తగ్గడం కొనుగోలుదారులకు మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒక్క ఏడాదిలోనే బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగి లక్ష రూపాయల మార్కును దాటేయడంతో సామాన్యులు ఆందోళన చెందారు. కానీ, తాజా తగ్గుదల ధరల పెరుగుదలకు బ్రేక్ పడిందనే సంకేతాలను ఇస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో తాజా ధరల వివరాలు:
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 తగ్గి, ప్రస్తుతం రూ.1,49,610 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం బంగారం ధర కూడా రూ.10 తగ్గి రూ.1,37,140 గా నమోదైంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,210 వద్ద ఉంది. పసిడితో పాటే వెండి కూడా స్వల్పంగా దిగివచ్చింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.100 తగ్గి రూ.2,69,900 గా ఉంది.
దేశంలోని ఇతర నగరాల్లో ఎలా ఉందంటే?
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,760గా ఉండగా, చెన్నైలో మాత్రం ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలో తులం బంగారం (24 క్యారెట్లు) రూ.1,52,720 వద్ద పలుకుతోంది. కర్ణాటకలో మన హైదరాబాద్ ధరలే కొనసాగుతుండటం గమనార్హం. వెండి విషయానికి వస్తే ఢిల్లీలో ధరలు మన దగ్గరి కంటే కొంచెం తక్కువగా (రూ.2,64,900) ఉన్నాయి. గడచిన కొన్ని రోజులతో పోలిస్తే ఈ తగ్గుదల చాలా తక్కువ మొత్తమే అయినప్పటికీ, ధరలు స్థిరంగా ఉండటం కొనుగోలుదారులకు సానుకూల అంశమే.
