Suicide

Suicide: మార్కుల పోలిక.. అధ్యాపకురాలి చెంపదెబ్బ: గద్వాలలో ర్యాంకర్ తరుణ్ విషాదాంతం!

Suicide: చదువుల్లో రాణిస్తూ, కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లిదండ్రుల ఆశలను నిలబెడుతాడు అనుకున్న కొడుకు కాటికి పోయాడు. అధ్యాపకురాలు చేసిన చిన్న హేళన, పెట్టిన అవమానం తట్టుకోలేక 17 ఏళ్ల పసి మనసు బలవన్మరణానికి ఒడిగట్టింది.

జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లికి చెందిన నేతికొట్టు తెలుగు బుచ్చన్న, రేణమ్మ దంపతులు రెక్కలముక్కలు చేసుకుంటూ వ్యవసాయం పైనే జీవిస్తున్నారు. వీరికిద్దరు కుమారులు కాగా, రెండో కుమారుడు తరుణ్ (17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

జిల్లా సెకండ్ ర్యాంకర్.. కానీ ఆ ఒక్క మార్కు తెచ్చిన ముప్పు!

తరుణ్ సాధారణ విద్యార్థి కాదు. గతేడాది ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 440 మార్కులకు గాను ఏకంగా 434 మార్కులు సాధించి, జిల్లా స్థాయిలోనే ద్వితీయ ర్యాంకర్ (2nd Rank) గా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. ఎంతో క్రమశిక్షణతో, కష్టపడి చదివే తరుణ్‌ను చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు.

అయితే, విద్యార్థులను ప్రోత్సహించాల్సిన కళాశాలలోని ఒక మహిళా లెక్చరర్ ప్రవర్తనే తరుణ్ ప్రాణాలను తీసింది. ఫస్ట్ ఇయర్‌లో మరో విద్యార్థికి వచ్చిన 435 మార్కులతో తరుణ్‌ను పోలుస్తూ, అందరి ముందూ హేళనగా మాట్లాడింది. ఆ ఒక్క మార్కు తక్కువ వచ్చిందనే నెపంతో అంతగా నిరుత్సాహపరచడం సబబు కాదని, అది సరైన పద్ధతి కాదని తరుణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

“నీవేమైనా మంత్రి కుమారుడివా?” అంటూ చెంపదెబ్బ!

విద్యార్థి ప్రశ్నించేసరికి విచక్షణ కోల్పోయిన సదరు లెక్చరర్.. “నీవేమైనా మంత్రి కుమారుడివా.. అంతకన్నా గొప్పవాడివా?” అంటూ అందరి ముందూ అతని చెంప చెల్లుమనిపించింది. క్లాస్‌రూమ్‌లో అందరి ముందు జరిగిన ఈ ఘోర పరాభవాన్ని, అవమానాన్ని తరుణ్ తట్టుకోలేకపోయాడు.

రెండు రోజుల పాటు తీవ్రమైన మనోవేదనతో, నిద్రలేని రాత్రులు గడిపాడు. చివరకు గుండెల్లో దాచుకున్న బాధను తట్టుకోలేక, తనకు జరిగిన అవమానాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తూ మూడు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. సోమవారం రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు, చదువుల్లో ముందంజలో ఉన్న బిడ్డ ఇలా ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రోత్సహించాల్సిన ఉపాధ్యాయులే కాలయముళ్లలా మారి ప్రాణాలు తీస్తుంటే విద్యార్థులకు దిక్కెవరంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుణ్ మృతికి కారణమైన లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *