Nirav Modi: వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం యూకే జైలులో ఉన్న నీరవ్ మోదీని ఈ నెల నవంబర్ 23న భారత అధికారులకు అప్పగించేందుకు మార్గం సుగమమైనట్లు సమాచారం.. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటం త్వరలో ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి.
నీరవ్ మోదీ తనను భారత్‌కు అప్పగిస్తే విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేస్తారని లండన్ కోర్టులో ఇటీవల మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం, బ్రిటిష్ అధికారులకు ఒక కీలకమైన హామీ పత్రాన్ని సమర్పించింది.
ఈ పత్రంలో, నీరవ్‌ను భారత్‌కు తీసుకొచ్చాక కేవలం ఆర్థిక మోసం, మనీలాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారిస్తామని, దర్యాప్తు సంస్థల ద్వారా ఎలాంటి చిత్రహింసలు ఉండవని స్పష్టం చేసింది. సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ వంటి ప్రముఖ ఏజెన్సీలన్నీ కలిసి ఈ హామీ పత్రాన్ని అందించాయి. ఈ హామీని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
Also Read: Islamabad: అరేబియా సముద్ర తీరంలో నౌకాశ్రయ ప్రతిపాదన
నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించిన తర్వాత, ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోని బ్యారక్ నంబర్ 12లో ఉంచుతారని సమాచారం. ఇది హై ప్రొఫైల్ ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్. యూకే అధికారులు, కోర్టుల సూచనల మేరకు ఈ సెల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు భారత దర్యాప్తు సంస్థలు గతంలోనే వీడియో సాక్ష్యాలతో నిరూపించాయి. ఈ ఏర్పాట్లు అప్పగింత ప్రక్రియకు సానుకూలంగా మారాయి.
తప్పుడు ఎల్వోయూల (Letter of Undertaking) ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.6,498 కోట్ల మేర నీరవ్ మోదీ నష్టాన్ని కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. 2018 జనవరిలో ఈ కుంభకోణం వెలుగులోకి రాగానే నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. 2019 మార్చిలో లండన్‌లో అరెస్టయినప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. 2021లోనే అతడిని భారత్‌కు అప్పగించడానికి అప్పటి బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఆమోదం తెలిపారు. అయితే, నీరవ్ మోదీ పదేపదే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలన ఈ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. అయినప్పటికీ, ఈడీ ఇప్పటికే నీరవ్‌కు చెందిన రూ.2,598 కోట్ల ఆస్తులను జప్తు చేసి, అందులో రూ.981 కోట్లను బాధిత బ్యాంకులకు అందజేసింది. నవంబర్ 23న జరగనున్న విచారణలో నీరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురై, ఆయనను భారత్‌కు అప్పగించేందుకు న్యాయస్థానం పచ్చజెండా ఊపుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.

