KTR

KTR: ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ ఫైనల్‌ రిపోర్ట్‌..

KTR: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) తన తుది నివేదికను (Final Report) ప్రభుత్వానికి సమర్పించింది. 2024, డిసెంబర్ 19న నమోదైన ఈ కేసుపై సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన ఏసీబీ, సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదికను పంపింది. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ సహా పలువురు నిందితులపై దర్యాప్తులో ఏసీబీ పలు కీలక అంశాలను ప్రస్తావించింది.

ఏసీబీ నివేదికలోని ప్రధాన అంశాలు

ఏసీబీ దర్యాప్తులో వెల్లడైన ముఖ్య విషయాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్‌ను నిర్వహించాలన్నది అప్పటి మంత్రి కేటీఆర్‌ సొంత నిర్ణయం అని ఏసీబీ నిర్ధారించింది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే, ప్రైవేట్ డిస్కషన్ల ఆధారంగా రేస్ నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయని ఏసీబీ పేర్కొంది. ఈ వ్యవహారంలో ‘క్విడ్ ప్రో కో’ (Quid Pro Quo) జరిగిందని ఏసీబీ స్పష్టం చేసింది.

ఈ రేస్ వ్యవహారానికి సంబంధించిన ట్రైపార్టీ అగ్రిమెంట్‌కు ముందే, బీఆర్‌ఎస్ పార్టీకి సుమారు ₹44 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ చెల్లించారని ఏసీబీ గుర్తించింది. ఈ బాండ్స్‌ను 2022 ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో చెల్లించారు. బీఆర్‌ఎస్‌కు ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో నిధులు ఇచ్చినందుకు గానూ, Ace NXT Gen కంపెనీకి రేస్ ప్రమోటర్‌గా అవకాశం కల్పించారని విచారణలో తేలింది.

ఇది కూడా చదవండి: Mohan Bhagwat: హిందువులు లేకపోతే ప్రపంచం లేదు.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన

ఈ రేస్ నిర్వహణలో అప్పటి ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ నిబంధనలను, పరిపాలనా విధివిధానాలను ఉల్లంఘించారని ఏసీబీ నివేదిక స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 166(1) మరియు 299 నిబంధనల ప్రకారం గవర్నర్ సంతకంతో ఎగ్జిక్యూట్ చేయాల్సిన కాంట్రాక్టులను.. అప్పటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కాంపిటీట్ అథారిటీ (Competent Authority) అనుమతి లేకుండానే అప్రూవ్ చేశారని ఏసీబీ తెలిపింది. ఈ రెండు అగ్రిమెంట్లు కూడా గవర్నర్ నోటీసులో లేవని తేలింది.

MAUD (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్) విభాగం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, HMDA నిధులను ప్రమోటర్‌గా ఉపయోగించారని పేర్కొంది. బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘిస్తూ.. అప్పటి సీఎం, సీఎస్, మరియు ఆర్థిక శాఖ మంత్రికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఒప్పందాలు జరిగాయని ఏసీబీ వెల్లడించింది.

ఎన్నికల కోడ్ ఉల్లంఘన

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో (2023 అక్టోబర్ 9 నుండి డిసెంబర్ 4 వరకు) ₹10 కోట్ల కంటే అధిక నిధులు చెల్లించాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనను ఉల్లంఘించారని, నిధుల చెల్లింపులు, అగ్రిమెంట్లు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఏసీబీ తుది నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదిక ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో ఉంది, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *