Vaira Madanlal: మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాణోత్ మదన్‌లాల్ మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, రాజకీయవర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గత నాలుగు రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మదన్‌లాల్ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
మదన్‌లాల్ గతవారం ఖమ్మంలోని తన నివాసంలో వాంతులు, విరేచనాల వల్ల అస్వస్థతకు గురయ్యారు. తొలుత స్థానిక హాస్పిటల్ కు తరలించిన కుటుంబ సభ్యులు, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అయినప్పటికీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోయాయి. మదన్‌లాల్ మృతిని కుటుంబ సభ్యులు బంధువులు అధికారికంగా ప్రకటించారు.
రాష్ట్ర నేతల సంతాపం
మదన్‌లాల్ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలను గుర్తు చేసుకుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మదన్‌లాల్ మరణం తీరనిలోటుగా అభివర్ణించిన కేసీఆర్, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని ఆకాంక్షించారు.
Also Read: CM Chandrababu: అదే నా ఆశ.. ఆకాంక్ష.. మహానాడు పై చంద్రబాబు ట్వీట్
Vaira Madanlal : బాణోత్ మదన్‌లాల్ 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైరా అసెంబ్లీ స్థానానికి విజయం సాధించి ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం పార్టీ మారి బీఆర్ఎస్‌లో చేరారు. 2018-2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినా, విజయం అందుకోలేకపోయారు. ఆ తర్వాత కూడా వైరా నియోజకవర్గానికి పార్టీ ఇన్‌ఛార్జిగా సేవలందిస్తూ కార్యకర్తలతో చురుకుగా వ్యవహరిస్తున్నారు.
మదన్‌లాల్ మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. అనేక బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు ఆయన మృతికి సంతాపం తెలిపారు. నియోజకవర్గంలో ఆయన వ్యక్తిగతంగా ప్రజలతో కలిసిపోతూ పనిచేయడం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు ఏర్పడింది.