Kakani: ఫోర్జరీ సంతకాల కేసులో చిక్కుకున్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి న్యాయస్థానం మరోసారి రిమాండ్ విధించింది. వెంకటాచలం తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణికి ఆగస్టు 7వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ గురువారం (జూలై 24, 2025) నెల్లూరు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లాలోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కాకుటూరు భూ కుంభకోణం కేసులో రిమాండ్:
కాకుటూరు సమీపంలో జరిగిన భారీ భూ అక్రమాలకు సంబంధించిన కేసులో భాగంగానే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఈ రిమాండ్‌ను విధించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆయనను గురువారం రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట వర్చువల్‌గా హాజరుపరిచారు. ఈ కేసులో ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Also Read: Mandipalli Bros on Fire: ఆ మంత్రి వైల్డ్ ఫైర్.. వైసీపీ మాజీకి 33 సార్లు ఫోన్
2021వ సంవత్సరంలో చోటుచేసుకున్న ఈ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు వెంకటాచలం తహసీల్దార్ లాగిన్‌ను అక్రమంగా ఉపయోగించి, గుడ్లూరు డిప్యూటీ తహసీల్దార్ లాగిన్ ద్వారా కాకుటూరు పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సుమారు 60 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై మార్చారు.
ఆ సమయంలో వెంకటాచలం తహసీల్దార్ ఫిర్యాదు చేయగా, పోలీసులు అనుమానితులను అరెస్టు చేశారు. అయితే, తాజాగా కూటమి ప్రభుత్వం ఈ కుంభకోణంపై లోతైన విచారణకు ఒంగోలు డీఎస్పీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.