Forest News: వనారణ్యంలో ఉండాల్సిన మృగాలు.. జనారణ్యంలోనే సంచరిస్తున్నాయి. ఆకలితో ఉంటే వన్య ప్రాణులను వేటాడి చంపే ఆ అడవి జంతువులు మనుషుల రక్తాన్ని తాగుతున్నాయి. వనారణ్యం దారి తప్పి జనారణ్యంలోకి ఆ వన్య మృగాలు వచ్చాయా? వాటి మానాన వాటిని వెళ్లనీయకుండా దారి తప్పేలా మానవ తప్పిదాలే జరిగాయా? ఏదైతే ఏమో కానీ ఇటీవల పులుల దాడిలో మనుషులు మరణిస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
Forest News: ఇటీవలే తెలంగాణలో పొలంలో పత్తి ఏరుతున్న మహిళను పులి చంపిన ఘటనను మరువుకముందే మరో రైతుపై పులి దాడి చేసి చేంపేంత పనిచేసింది. కానీ తీవ్రగాయాల పాలైన ఆ రైతు చికిత్స పొందుతున్నాడు. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటుచేసుకొని ఆందోళనను కలిగిస్తున్నది. అటవీశాఖ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
Forest News: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శారద (24) అనే మహిళ 8 నెలల గర్భిణి. పొలం పనులకు వెళ్లి పనులు ముగిశాక ఇంటికి తిరిగివెళ్తున్నది. దారి మధ్యలో ఆమెపై పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Forest News: మానవ తప్పిదాల కారణంగా అటవీ విస్తీర్ణం కుదించుకుపోతున్నది. ఫలితంగా వన్య ప్రాణులతోపాటు మృగాలు కూడా ఊళ్లపైకి వస్తున్నాయి. పంట చేలల్లో పనులు చేసుకునే రైతులు, కూలీలపై పడి దాడులు చేస్తున్నాయి. ఈ తప్పిదాలను కట్టడి చేయకపోతే మరింత అల్లకల్లోలం ఏర్పడి ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉన్నది.