Tirupathi Fire Accident: తిరుపతి నగరంలో గోవిందరాజస్వామి ఆలయం వద్ద సోమవారం ఉదయం ఒక ప్రమాదకరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆలయం ముందు భాగంలో ఉన్న ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్రమంగా షాపు మొత్తానికీ వ్యాపించాయి. దీంతో భారీగా పొగలు ఎగిసిపడ్డాయి. అదే సమయంలో ఆలయం ముందు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి.
ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. కొంతమంది భక్తులు ఆలయ ఆవరణలో ఉండగా, మరికొంతమంది ఆలయం వెలుపల ప్రాంగణంలో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: Crime News: గచ్చిబౌలిలో దారుణం.. బెట్టింగ్ ఆడొద్దన్న తండ్రిని చంపిన కొడుకు
కొద్ది సేపట్లోనే ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని మంటలను సమర్థవంతంగా అదుపులోకి తీసుకుంది. దీంతో ఆలయానికి పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
అయితే, మంటల్లో షాపులో ఉన్న ఇత్తడి వస్తువులు, పూజా బొమ్మలు పూర్తిగా కాలిపోయాయి. ప్రస్తుతం షాపు ముందు మరియు ఆలయం ప్రాంగణంలో విచారణ కొనసాగుతోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనా.
ఈ ఘటనపై ఆలయ అధికారులు, స్థానిక పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. భక్తుల భద్రతకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు.