Chandigarh: చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం తీవ్ర రసాభాసగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్‌లు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో, అమిత్ షా పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్‌లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం ఆమోదం పొందడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించిన పోల్ ఆఫీసర్ అనిల్ మాషీ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ రాహుల్ గాంధీపై ఉన్న ఇండియా హెరాల్డ్ కేసును ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వాదం పెరిగి గొడవకు దారితీసింది. ఇరు పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు బాహాబాహీగా దిగారు.
బీజేపీ కౌన్సిలర్‌లు, కాంగ్రెస్ హయాంలోనే అంబేద్కర్‌ను అవమానించారని, నెహ్రూ హయాంలోనే అంబేద్కర్ కించపర్చబడ్డారని ఆరోపించగా, దీనికి కాంగ్రెస్ కౌన్సిలర్‌లు తీవ్రంగా స్పందించారు. ఇరు పార్టీల మధ్య వాగ్వాదం ముదిరి, సమావేశం గందరగోళంగా ముగిసింది.
ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు వీడియో రూపంలో బయటకొచ్చాయి. రాజకీయ నాయకులు ప్రజల సమస్యలపై చర్చించాల్సిన వేదికలు, వాదవివాదాలకు మార్పడటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.