Viral News: హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకున్న ఒక సంఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. మహారాష్ట్ర పూణెకు చెందిన ఓ యువతి, తన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మంత్రాలతో వైద్యం చేస్తానంటూ మోసం చేసిన ఓ బురిడీ బాబా వలలో చిక్కుకుంది. చివరికి ఆ యువతి జీవితమే తలకిందులైంది.
తన ఆరోగ్యం బాగోలేదని బాధపడుతున్న బాలికను బంధువులు సలహా మేరకు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. పాతబస్తీ పరిధిలోని నవాబ్‌సాహెబ్ కుంటలో నివసిస్తున్న ఓ బాబా గురించి విని, ఆయనను ఆశ్రయించారు. మొదట మంత్రాలు, పూజలతో చికిత్స చేస్తానంటూ కుటుంబాన్ని నమ్మబలికిన బాబా, కొద్దికాలంలోనే ఆ యువతితో సన్నిహితమయ్యాడు. తల్లిదండ్రులు కూడా తన మాటలను నమ్మి, కూతురిని తరచూ అతని దగ్గరికి పంపడం మొదలుపెట్టారు.
ఇది కూడా చదవండి: Israel Gaza War: ఇజ్రాయెల్‌కు అమెరికా 21.7 బిలియన్ డాలర్ల సాయం!
ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న బాబా, బాలికపై మాయ జాల విసిరాడు. ఆరోగ్యం పూర్తిగా బాగుపడాలంటే ప్రత్యేక పూజ చేయాల్సి ఉందని చెప్పి, ఒక రోజు దర్గాకు తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు రావద్దని చెప్పి, ఆ యువతిని ఒంటరిగా తనతో తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో మంత్రాల పేరుతో పెళ్లి చేసుకున్నాడు.
సాయంత్రం వరకు కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాబా ఇంటికి వెళ్లి చూడగా, ఇద్దరూ మెడల్లో దండలతో ఉన్నారు. “మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం” అని చెప్పడంతో కుటుంబం షాక్‌కు గురైంది.
తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా, శాలిబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, కొద్ది రోజులకే ఆ యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరో షాక్ ఇచ్చింది. తాను మేజర్ని, స్వచ్ఛందంగా బాబాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపింది.
ఇది కూడా చదవండి: Nara Lokesh: ప్రజా ప్రభుత్వ పాలనలో జగన్ ఆటలు సాగవు.. లోకేష్ మాస్ వార్నింగ్
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఆ బాబాకు ఇప్పటికే భార్యా పిల్లలు ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఇద్దరు పిల్లల తండ్రి అయినప్పటికీ, తాను సన్యాసిగా అవతారం ఎత్తి మంత్రాలు చెబుతానని నమ్మబలికి బాలికను తన వశం చేసుకున్నాడు.
తమ కూతురిని మాయమాటలతో మోసం చేసి జీవితాన్ని నాశనం చేసిన ఆ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు.
ఇలాంటి ఘటనలు మరోసారి సమాజానికి హెచ్చరికలా మారాయి. మంత్రాలు, తంత్రాలు అంటూ గల్లీ గల్లీ తిరిగే బురిడీ బాబాల మాటలు నమ్మి జీవితాలను పణంగా పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.