Makhana: సాధారణంగా తామర గింజలు లేదా ఫూల్ మఖానాను ఆరోగ్యకరమైన చిరుతిండిగా (Snack) భావిస్తారు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, బరువు నియంత్రణలో ఉండటం సహా, గుండె ఆరోగ్యం మెరుగుపడి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. మఖానాలో ఐరన్, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇది గ్లూటెన్ రహిత ఆహారం కూడా.
అయితే, మఖానా ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దీనిని అతిగా తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మఖానాను అధికంగా తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Also Read: Walnuts: వాల్‌నట్స్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..
ఎక్కువ తింటే కలిగే నష్టాలు : 
మఖానాను పరిమితికి మించి తీసుకుంటే ఎదురయ్యే ప్రధాన సమస్యలు:
కిడ్నీలో రాళ్ల ప్రమాదం: తామర గింజల్లో కాల్షియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని అధికంగా తినడం వలన శరీరంలో కాల్షియం నిల్వలు పెరిగి, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే లేదా ఇప్పటికే ఉన్న రాళ్ల పరిమాణం పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు మఖానా తినకుండా ఉండటం శ్రేయస్కరం.
గుండె సంబంధిత సమస్యలు: మఖానాను వేయించేటప్పుడు లేదా తయారుచేసేటప్పుడు కలిపే ఉప్పు (Sodium) ఎక్కువగా ఉంటే, అది రక్తపోటును పెంచి, గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది.
ఇతర అనారోగ్యాలు: మఖానాను అతిగా తినడం వలన కొందరిలో అలెర్జీలు లేదా జీర్ణ సంబంధిత సమస్యలైన విరేచనాలు, అలాగే జ్వరం, దగ్గు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కాబట్టి, మఖానా అద్భుతమైన ప్రయోజనాలు అందించినప్పటికీ, దీనిని మితంగా మాత్రమే తీసుకోవడం ఉత్తమమని, బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

