Imran Khan: పాకిస్థాన్ రాజకీయాల్లో సంచలనం రేపుతూ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి తోషాఖానా–2 అవినీతి కేసులో ఊరట లభించకపోగా 17 ఏళ్ల సుదీర్ఘ జైలు శిక్ష ఖరారైంది. రావల్పిండిలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన అదియాలా జైలులో ప్రత్యేక న్యాయమూర్తి షారూక్ అర్జుమంద్ ఈ కీలక తీర్పును వెలువరించారు. ఈ కేసు ప్రధానంగా 2021లో ఇమ్రాన్ ఖాన్ అధికారిక పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా చక్రవర్తి నుంచి అందుకున్న ఖరీదైన ‘బల్గేరి జ్వలరీ సెట్’ చుట్టూ తిరుగుతోంది.
ప్రభుత్వ ఖజానాకు చెందాల్సిన ఈ అత్యంత విలువైన కానుకను ఇమ్రాన్ దంపతులు నిబంధనలకు విరుద్ధంగా తమ సొంతానికి వాడుకున్నారని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) కోర్టు నిర్ధారించింది. పాకిస్థాన్ కరెన్సీలో సుమారు 7.15 కోట్ల రూపాయల విలువ చేసే ఈ నగలను కేవలం 58 లక్షల రూపాయలకే దక్కించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ చర్యను ప్రభుత్వ నమ్మకద్రోహంగా, మోసపూరితమైన అవినీతిగా కోర్టు అభివర్ణించింది.
Also Read: Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
శిక్షా కాలం విషయానికి వస్తే, పాకిస్థాన్ శిక్షా స్మృతిలోని సెక్షన్ 409 కింద వీరికి 15 జైలు శిక్ష పడగా, అవినీతి నిరోధక చట్టం ప్రకారం మరో ఏడేళ్ల శిక్షను న్యాయస్థానం విధించింది. వీటితో పాటు ఒక్కొక్కరికి 10 మిలియన్ల భారీ జరిమానా కూడా విధిస్తూ, ఒకవేళ ఈ జరిమానా చెల్లించని యెడల అదనపు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే 14 ఏళ్ల శిక్షతో జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్, ఈ తాజా తీర్పుతో మరింత ఇబ్బందుల్లో పడ్డారు.
ఈ తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, ఆయన స్థాపించిన పీటీఐ (PTI) పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై రాజకీయ కక్షతోనే ఇటువంటి అక్రమ కేసులు పెట్టారని ఇమ్రాన్ ఖాన్ వాదిస్తుండగా, ఆయన న్యాయబృందం ఈ తీర్పును సవాలు చేస్తూ త్వరలోనే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలతో పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

