వాలంటీర్ హత్యకేసులో వైసీపీ నేత, మాజీమంత్రి కుమారుడు పినిపె విశ్వరూప్ కుమారుడు పినిపె శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితమే శ్రీకాంత్ ను మధురైలో అరెస్ట్ చేసినట్లు ఏపీ పోలీసులు వెల్లడించారు. రెండేళ్ల క్రితం అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనకాల శ్రీకాంత్ హస్తం ఉందని మొదటి నుంచీ ఆరోపణలు వస్తున్నా.. అప్పడు అధికారంలో ఉన్నది వైసీపీ కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నేరాల్లో నిందితులైన వారిపై చర్యలు తీసుకుంటోంది.
జనుపల్లి దుర్గాప్రసాద్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లికి చెందిన వాలంటీర్. 2022, జూన్ 6న హత్యకు గురయ్యాడు. పినిపె శ్రీకాంత్ పథకం ప్రకారమే అతడిని హత్యచేయించినట్లు కొత్తపేట డీఎస్పీ గోవిందరావు వెల్లడించారు. సోమవారం రాత్రి తమిళనాడులోని మధురైలో అరెస్ట్ చేసి.. మంగళవారం రాత్రి కొత్తపేట డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. రాత్రి 11 గంటలకు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గౌరీశంకర్ రావు ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.