Etala Rajender: బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు అన్నిరకాలుగా కేంద్రంలోని బీజేపీయే చేసిందని, ఇన్నేళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీసీలకు మేలే చేయలేదని ధ్వజమెత్తారు. ఒక్క బీసీని, గిరిజనుడిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేయలేదని ఆరోపించారు. బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.
Etala Rajender: చట్టసభల్లోనూ బీసీలకు వాటా కావాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి నిండు అసెంబ్లీలో గతంలో చెప్పారని, అన్నీ తెలిసి కూడా ఆయన బీసీలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజాయితీగా ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే రిజర్వేషన్లను అమలు చేశారని పేర్కొన్నారు. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్లపాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య తదితర రంగాలపై సమగ్ర సర్వే చేసి, ఆ రిపోర్ట్‌తో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చేర్చారని తెలిపారు.
Etala Rajender: తెలంగాణలో గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి సర్వే చేశారని, బీసీ కమిషన్ వేశారని, ఎన్ని వేసినా, చేసినా నిజాయితీ లేక అది ఆనాడు అమలు కాలేదని ఆరోపించారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేరుకే కమిషన్లు వేసింది తప్ప నిజాయితీని ప్రదర్శించలేదని తెలిపారు. లెక్కలు తీశారు కానీ, తప్పుల తడకగా తేల్చారని పేర్కొన్నారు. 52 శాతానికి పైగా బీసీలు ఉంటే, 42 శాతంగా కాకి లెక్కలను చెప్తున్నారని ఆరోపించారు. తాను చెప్పింది అబ్ధమైతే రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమేనని చెప్పారు.
Etala Rajender: బీసీలు మేమెంతో.. మాకంత కావాలి.. అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. యాచించే స్థాయిలో కాదు.. శాసించే స్థాయిలో ఉన్నామని స్పష్టంచేశారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుందని, ఆ కుటుంబమే అధికారాన్ని ఏలుతుందని విమర్శించారు.
Etala Rajender: కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ అయినా స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఒక్క బీసీ, గిరిజనుడిని ముఖ్యమంత్రిని చేయలేకపోయిందని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారులో 8 మంది బీసీ మంత్రులుండాలని, కానీ, ముగ్గురే ఉన్నారని తెలిపారు. ఉన్న వారికి కూడా ప్రాధాన్యం లేని శాఖలను అంటగట్టారని ఆరోపించారు. బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చే బదులు, నామినేటెడ్ పోస్టుల్లో ఎందుకు బీసీలకు స్థానం కల్పించలేదని ప్రశ్నించారు.
Etala Rajender: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని ఈటల రాజేందర్ తెలిపారు. మోదీ క్యాబినెట్‌లో 27 మంది ఓబీసీలు మంత్రులుగా ఉన్నారని తెలిపారు. బీజేపీ నిజాయితీని ఎవరూ శంకించలేరని స్పష్టం చేశారు. మాదిగ రిజర్వేషన్ చేస్తామని మాటిచ్చి, ప్రధాని మోదీ అమలు చేసి చూపారని తెలిపారు.
Etala Rajender: బీసీల ఉద్యమం ఇంతటితో ఆగవద్దని, 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు అమలయ్యేదాకా బీసీలు ఉద్యమించాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. తమది యాచన కాదని, పాలించే శక్తి ఉన్నదని స్పష్టంచేశారు. బీసీల రాజ్యాధికారం కోసం ఆశయాన్ని ముద్దాడే వరకూ ఐక్య ఉద్యమాలు చేద్దామని పిలుపునిచ్చారు.