India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ ఇప్పటికే తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. మరోవైపు,భారత జట్టు ఇంకా తన ఆడే జట్టును వెల్లడించలేదు. టెస్ట్ మ్యాచ్ కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తాను 4వ స్థానంలో ఆడతానని చెప్పాడు. అటువంటి పరిస్థితిలో 3వ స్థానంలో ఎవరు వస్తారన్నది ఆసక్తిగా మారింది.
గతంలో, శుభ్‌మాన్ గిల్ టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. కానీ ఇప్పుడు గిల్ 4వ స్థానంలోకి వస్తున్నందున, 3వ స్థానంలో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రెస్ మీట్‌లో కూడా గిల్ దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. టీమిండియాలో ప్రస్తుతం ఇద్దరు బలమైన ఆటగాళ్ళు మూడవ స్థానం కోసం పోటీ పడుతున్నారు. వారే సాయి సుదర్శన్, కరుణ్ నాయర్.
IPL 2025 లో సాయి సుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన
23 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత టెస్ట్ జట్టులో అవకాశం పొందడం ఇదే మొదటిసారి. అతను IPLలో అద్భుత ప్రదర్శన చేశాడు. 15 మ్యాచ్‌ల్లో మొత్తం 759 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 1957 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్ పై కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
కరుణ్ నాయర్ దేశీయ క్రికెట్‌లో చాలా పరుగులు చేశాడు. ఆ తర్వాత అతను IPL 2025లో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు కరుణ్ 8ఏళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. 2017లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో కూడా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అతనికి చాలా అనుభవం ఉంది. అది భారత జట్టుకు ఉపయోగపడుతుంది. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 8470 పరుగులు చేశాడు.
ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని కెప్టెన్, కోచ్ అతడిని మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపే అవకాశం ఉంది. సాయి సుదర్శన్‌కు మిడిలార్డర్‌లో కూడా అవకాశం లభించే అవకాశం ఉంది. స్టార్ బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్‌కు రానున్నాడు.