Hyderabad: మేడ్చల్ జిల్లా, మేడిపల్లి పరిధిలోని నారపల్లిలో ఉన్న మధు బాయ్స్ హాస్టల్లో ఉంటున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. సీనియర్ల ర్యాగింగ్, వేధింపులే ఈ దుర్ఘటనకు కారణమని అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ర్యాగింగ్‌తో వేధింపులు
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి పేరు జాదవ్ సాయి తేజ. అతడి స్నేహితుల వివరాల ప్రకారం, సాయి తేజను సీనియర్లు తరచూ ర్యాగింగ్ చేసేవారు. బలవంతంగా మద్యం తాగించడమే కాకుండా, ఒక బార్కి తీసుకెళ్లి రూ.10,000 బిల్లు కట్టాలని ఒత్తిడి చేశారు. ఈ వేధింపులు తట్టుకోలేక సాయి తేజ హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వారు పేర్కొన్నారు.
తండ్రి ఆవేదన
సాయి తేజ తండ్రి ప్రేమ్ సింగ్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నా కొడుకు నిన్న ఉదయం నాకు కాల్ చేసి రూ.1,500 అడిగాడు, నేను వెంటనే పంపించాను. కానీ రాత్రి నాకు ఒక వీడియో పంపాడు, అందులో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే కాల్ చేస్తే సమాధానం లేదు. హాస్టల్ వారికి కాల్ చేస్తే, నా కొడుకు అప్పటికే చనిపోయాడు అని చెప్పారు” అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
ఆ వీడియోలో సీనియర్లు తన కొడుకుని కొట్టారని, బార్కి తీసుకెళ్లి రూ.10,000 బిల్లు కట్టమన్నారని ప్రేమ్ సింగ్ తెలిపారు. డబ్బులు లేవని చెప్పడంతో దాడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు వచ్చేలోపే అతడిని కిందికి దింపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.