Electricity Associations: ఆంధ్ర రాష్ట్ర ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ సమావేశం సుమారు మూడు గంటలపాటు కొనసాగింది. విద్యుత్ సంస్థల CMDలు, ఉన్నతాధికారులు, విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్న ఈ చర్చల్లో ఉద్యోగుల వేతన సవరణలు, సర్వీసు రూల్స్, పదోన్నతులు, భద్రతా చర్యలు వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
కొంత పురోగతి – ఇంకా కొన్ని అంశాలు పెండింగ్
జేఏసీ నేత కృష్ణయ్య మాట్లాడుతూ, “ప్రభుత్వం వైఖరి ఈ సారి కొంత సానుకూలంగా ఉంది. కొన్ని అంశాలపై అంగీకారం సాధ్యమైంది కానీ, పాత పింఛన్ పద్ధతి పునరుద్ధరణ, పెండింగ్ డీఏలు విడుదల, ఫీల్డ్ సిబ్బంది భద్రతా చర్యలు వంటి కీలక విషయాలపై ఇంకా తుది నిర్ణయం రాలేదు” అని తెలిపారు.
ఇది కూడా చదవండి: TG News: తెలంగాణలో ఇరిగేషన్‌శాఖలో 51 మంది ఇంజినీర్లపై బదిలీ వేటు
మోదీ పర్యటన దృష్ట్యా సమ్మె తాత్కాలిక వాయిదా
ఇక మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు విద్యుత్ ఉద్యోగ సంఘాలు తమ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ అధికారులతో చర్చలు జరపాలని నిర్ణయించారు. ఆ చర్చల్లో సమస్యలు పరిష్కారం దిశగా సాగకపోతే, సమ్మె తప్పదని వారు హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి
ఈ చర్చలు విద్యుత్ రంగంలో ఉద్యోగులు, ప్రజల మధ్య ఆసక్తి రేకెత్తించాయి. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుందనే దానిపై అందరి దృష్టి నిలిచింది. తుది చర్చల్లో పరిష్కారం దిశగా ముందడుగు పడుతుందో, లేక మరోసారి సమ్మె స్ఫూర్తి చెలరేగుతుందో అన్నదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.