Egg Price Hike

Egg Price Hike: కోడిగుడ్డు ధరల మోత.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి.. ఒక్కో గుడ్డు?

Egg Price Hike: కోడి గుడ్డు.. వెరీ గుడ్ ఫుడ్ అని అందరూ చెబుతారు. ఎన్నో రకాల పోషకాలు ఉండే గుడ్డును రోజూ ఒకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే, డైట్ చేసేవారు, వ్యాయామాలు చేసేవారు దీనిని ఎక్కువగా తీసుకుంటారు. కానీ, ఇప్పుడు ఈ ‘గుడ్ ఫుడ్’ ధర సామాన్యులకు గుబులు పుట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధరలు రికార్డులు బద్దలు కొట్టాయి. రిటైల్ మార్కెట్‌లో ఒక గుడ్డు ధర ఏకంగా 8 రూపాయలు దాటి అమ్ముడవుతోంది.

ఈ ధరల పెరుగుదలకు కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో చలి బాగా పెరగడం వలన అక్కడ గుడ్ల వాడకం విపరీతంగా పెరిగింది. దాంతో, మన తెలుగు రాష్ట్రాల నుంచే అక్కడికి ఎగుమతులు ఎక్కువ అయ్యాయి. దీంతో మన మార్కెట్‌లో గుడ్ల కొరత ఏర్పడింది. మరోవైపు, ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని వ్యాధుల కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం కూడా గుడ్ల ఉత్పత్తి తగ్గడానికి కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు. తుఫాన్ వంటి ప్రకృతి విపత్తుల వల్ల కూడా కొంత నష్టం జరిగింది.

కార్తీక మాసం ముగిసింది కదా, ఇక నాన్-వెజ్ తిందామని మార్కెట్‌కి వెళ్లిన వాళ్లకు ఈ పెరిగిన గుడ్డు ధరలు షాక్ ఇచ్చాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.673 వరకు చేరింది. ఇక చిల్లర దుకాణాలకు వచ్చే సరికి డిమాండ్‌ను బట్టి ఒక్కో గుడ్డును రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు. కూరగాయల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతుంటే, ఇప్పుడు గుడ్డు కూడా అదే దారిలో వెళ్లడం పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద భారంగా మారింది.

విశాఖపట్నంలో హోల్‌సేల్‌లో 100 గుడ్లు రూ.673 పలుకుతుండగా, హైదరాబాద్, చిత్తూరు లాంటి ప్రాంతాల్లో రూ.635గా ఉంది. అయితే, రిటైల్‌కు వచ్చే సరికి ధరలు రూ.6.50 నుంచి రూ.8 వరకు ఉంటున్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గడం వల్ల వచ్చే కొన్ని రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిస్థితి చూసి కొందరు వినియోగదారులు.. గుడ్డు, కూరగాయల కంటే చికెన్ ధరలే నయమంటున్నారు! ప్రభుత్వం, అధికారులు ఈ ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *