AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ బస్సు డ్రైవర్ తన ప్రాణాలను పణంగా పెట్టి, బస్సులో ఉన్న దాదాపు 50 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడి అందరి మనసుల్లో హీరోగా నిలిచాడు. ఈ విషాదకర సంఘటన డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం, మడికి జాతీయ రహదారిపై జరిగింది.
ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన డి. నారాయణరాజు రాజమహేంద్రవరంలోని డైట్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కొత్తపేట మండలం గంటి నుంచి విద్యార్థులను ఎక్కించుకుని కళాశాలకు వెళ్తుండగా, అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 50 మంది విద్యార్థులు ఉన్నారు. తీవ్రమైన గుండెపోటు వచ్చినా, ఆయన సమయస్ఫూర్తిని కోల్పోలేదు. ముందుచూపుతో వెంటనే బస్సు వేగాన్ని తగ్గించి, దాన్ని రోడ్డు పక్కకు సురక్షితంగా నిలిపాడు.
బస్సు ఆపిన వెంటనే నారాయణరాజు స్టీరింగ్‌పై వాలిపోయారు. డ్రైవర్ కదలకపోవడంతో విద్యార్థులు అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా, ఆయన అప్పటికే విగతజీవిగా కనిపించారు. తాను చనిపోతూ కూడా, 50 మంది విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడిన నారాయణరాజు ధైర్యాన్ని, త్యాగాన్ని స్థానికులు, విద్యార్థులు కొనియాడారు. ఆయన గొప్ప ముందుచూపుకు కృతజ్ఞతలు తెలిపారు.

