Donkey Milk Scam

Donkey Milk Scam: గాడిద పాల పేరుతో రూ.10 కోట్ల మోసం, బాబోయ్.. ఇలా కూడా చెయ్యొచ్చా?

Donkey Milk Scam: గత కొంతకాలంగా గాడిద పాల వ్యాపారం రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. లీటర్ పాల ధర ఏకంగా రూ. 3 వేల వరకు పలకడంతో చాలా మంది యువత గాడిదల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు యువకులు డంకీ డైరీలు రన్ చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు గాడిద పాల వ్యాపారం పేరుతో అమాయక రైతుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇంతకీ ఈ ఘరానా మోసం చేసిన ఘనుడు ఎవరో తెలుసా?

ఈ భారీ మోసం కర్ణాటకలో జరిగింది. ఏపీలోని అనంతపురానికి చెందిన నూతలపాటి మురళీ అనే వ్యక్తి మూడు నెలల క్రితం హొసపేటెలో జెన్నీ మిల్క్ పేరుతో ఓ కంపెనీ ప్రారంభించారు. కార్పోరేట్ డెయిరీ మాదిరిగానే కలరింగ్ ఇచ్చారు. కంపెనీలో పలువురు ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నారు. గాడిదపాలతో సులభంగా లక్షధికారులు కావచ్చంటూ జోరుగా ప్రచారం మొదలు పెట్టారు. గ్రామీణ ప్రాంతాలలోని రైతులను టార్గెట్ చేసుకుని ప్లాన్ అమలు చేశారు.

Donkey Milk Scam: ముందుగా తమ కంపెనీకి రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తే, మూడు పాలిచ్చే గాడిదలను ఇస్తామని చెప్పారు. వాటి నుంచి వచ్చే పాలను కూడా తామే కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ఒక్కో లీటర్ పాలకు రూ. 2,350 చెల్లిస్తామని చెప్పారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉండటంతో రైతులు నిజంగానే లక్షాధికారులు అయిపోవచ్చని ఆశపడ్డారు. ఏకంగా 318 మంది రైతులు ఒక్కొక్కరు రూ. 3 లక్షల చొప్పున చెల్లించారు.

గాడిద పాల వ్యాపారంపై ఓ రైతుకు అనుమానం కలిగింది. ఇందులో ఏదో మోసం జరుగుతుందని భావించి, అధికారులకు ఫిర్యాదు చేశాడు. విజయనగర పోలీసులు, అధికారులు కలిసి ఈ వ్యాపార సంస్థపై దర్యాప్తు మొదలు పెట్టారు. అసలు ఈ కంపెనీకి అనుమతులు లేవని గుర్తించారు. వెంటనే, సంస్థను క్లోజ్ చేసి సీల్ వేశారు. విషయం బయటకు తెలియడంతో సంస్థ ఎండీతో పాటు ప్రమోటర్లు పరారయ్యారు.

Donkey Milk Scam: ఈ కేసును సీరియస్ గా తీసుకున్న విజయనగర ఎస్పీ శ్రీహరి బాబు, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఏఎస్పీ సలీం పాషా నేతృత్వంలో స్పెషల్ టీమ్ ను అరెస్టు చేశారు. తాజాగా జెన్నీ మిల్క్ నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో జెన్నీ మిల్క్ ఎండీ మురళీ, మేనేజర్ కవలపల్లి ఉమాశంకర్ రెడ్డి, సూపర్‌వైజర్‌ సయ్యద్‌ మహమ్మద్‌ గౌస్‌ ఉన్నారు. బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీహరి బాబు వెల్లడించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *