Donald Trump: అమెరికా అధ్యక్ష పదవి అంటే కేవలం అధికారం, గౌరవం మాత్రమే కాదని, అత్యంత ప్రమాదకరమైన వృత్తి అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ విషయం నాకు ఎవరైనా ముందే చెప్పి ఉంటే, నేను ఈ రేసులో ఉండేవాడిని కాదు” అని ఆయన బాహాటంగా వెల్లడించారు.
అధ్యక్షుడిగా ప్రమాదం… చావు అంచున:
తాజాగా వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, అధ్యక్ష పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని, అది అనేక సవాళ్లతో కూడుకుందని వివరించారు. ఈ బాధ్యతను కారు రేసింగ్, బుల్ రైడింగ్ వంటి ప్రమాదకరమైన వృత్తులతో పోల్చారు. “కారు రేసింగ్ డ్రైవర్లు లేదా బుల్ రైడర్లలో 10 మందిలో ఒకరు మరణించే అవకాశం ఉంది. అంటే 0.1 శాతం మంది చనిపోయే ఛాన్స్ ఉంది. కానీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాదాపు 5 శాతం మరణించే అవకాశాలు ఉన్నాయి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమని ఆయన ఉద్ఘాటించారు.
ట్రంప్ తన గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ, గతేడాది (జూలై 13, 2024) పెన్సిల్వేనియాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రస్తావించారు. ఆ ఘటనలో ఓ భవనంపై నుంచి దుండగుడు కాల్పులు జరపగా, తన కుడి చెవికి బుల్లెట్ తగిలి గాయమైందని తెలిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారని, దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారని వెల్లడించారు.
Also Read: Abortion Cases: ఇండియాలోని ఆ ప్లేస్ లో చదువులోను.. అబార్షన్ లోను ఫస్ట్ ప్లేస్
Donald Trump: అంతేకాకుండా, గతంలో ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో గోల్ఫ్ ఆడుతుండగా, ఒక వ్యక్తి తుపాకీతో తన వద్దకు రావడానికి ప్రయత్నించాడని, భద్రతా బలగాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయని ట్రంప్ గుర్తు చేశారు. అలాగే, మరోసారి ఒక సమావేశం సమీపంలో AK-47 తుపాకీతో ఉన్న మాస్క్ ధరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఫాక్స్ న్యూస్ గతంలో నివేదించింది.
అమెరికా చరిత్రలో ఇప్పటివరకు నలుగురు అధ్యక్షులు పదవిలో ఉండగానే హత్యకు గురయ్యారు. మరికొందరు అభ్యర్థులు కూడా కాల్పుల్లో గాయపడ్డారు. ఈ సంఘటనల నేపథ్యంలో, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అధ్యక్ష పదవికి ఉన్న అపారమైన సవాళ్లు, భద్రతాపరమైన ముప్పులను మరోసారి తెరపైకి తెచ్చాయి. ఇటీవల, తన కార్యనిర్వాహక ఉత్తర్వులను అడ్డుకుంటున్న ట్రయల్ కోర్టుల అధికారాలపై అమెరికా సుప్రీంకోర్టు కోత విధించిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.