Karthika Masam: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటైన కార్తీక మాసం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ ఏడాది (2025) నవంబర్ 17వ తేదీన కార్తీక మాసం చివరి సోమవారం రానుంది. ఈ 30 రోజుల కాలానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ, కార్తీక సోమవారాలు, ముఖ్యంగా చివరి సోమవారానికి విశేష ప్రాధాన్యత ఉందని పండితులు పేర్కొంటున్నారు.
పురాణాల ప్రకారం, కార్తీక మాసంలో దేవతలంతా దివి నుంచి భూమికి దిగివచ్చి ‘దేవతల దీపావళి’ జరుపుకుంటారని ప్రతీతి. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోయి, అదృష్టం, సిరి సంపదలు కలుగుతాయని విశ్వాసం.
చివరి సోమవారం ప్రాధాన్యత
నవంబర్ 17న వచ్చే ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివుడిని పూజిస్తే, ఆయన అనుగ్రహం పొంది దరిద్రాలన్నీ తొలగిపోవడం ఖాయమని పండితులు చెబుతున్నారు. ఈ రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల భక్తులకు విద్య, ఆరోగ్యం, సిరి సంపదలు, సంతోషం కలుగుతాయని నమ్ముతారు.
శివయ్య అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాలు
కార్తీక మాసమంతా ఆలయానికి వెళ్లలేని వారు కూడా ఈ చివరి సోమవారం తప్పకుండా శివాలయానికి వెళ్లి ఈ పనులు చేయాలి:
-
శుభ్రత, దీపారాధన: ఉదయాన్నే ఇంటినీ, ఒంటినీ శుభ్రం చేసుకుని, శివుడిని ఆరాధించాలి. ఇంట్లో శివుడి ముందు నెయ్యితో దీపం వెలిగించాలి.
-
ఆలయ దర్శనం, ఉపవాసం: నవంబర్ 17వ తేదీన ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివ నామస్మరణ చేయాలి. తప్పకుండా శివక్షేత్రాన్ని సందర్శించాలి.
-
పవిత్ర అభిషేకం: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ పత్రాలను సమర్పించాలి. శివలింగానికి నీటితో లేదా పాలు, పెరుగు, తేనె, పంచామృతం వంటి వాటితో అభిషేకం చేయించాలి. గంగాజలం, చెరుకు రసంతో అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు దక్కుతాయని నమ్మకం.
-
దీపాల వెలుగు: కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపారాధన చేయలేనివారు, లేదా పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగించనివారు… చివరి సోమవారం రోజున తప్పకుండా 365 వత్తులు లేదా లక్ష వత్తులతో దీపాలు వెలిగించాలి.
-
ధ్వజస్తంభ పూజ: ఆలయంలో ఉండే ధ్వజ స్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించడం శుభకరం.
-
నందికి ఆహారం: కార్తీక సోమవారం రోజున శివుడి వాహనం నంది కనుక, గోమాత (ఆవు)కు ఆహారం తినిపించడం వల్ల శివయ్య అనుగ్రహం లభిస్తుంది.
-
దానధర్మాలు: మీ స్తోమతను బట్టి అన్నదానం, వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయాలి. దానధర్మాలు చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా కార్తీక మాసం చివరి సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో శివయ్యను ఆరాధించి, పైన తెలిపిన పరిహారాలు పాటిస్తే అష్టైశ్వర్యాలు, అదృష్టం మీ సొంతమవుతాయి.

