Dk shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ అసెంబ్లీలో అనూహ్యంగా అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై చర్చ జరుగుతుండగా, ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రార్థనలోని కొన్ని పంక్తులను గళం విప్పి పాడారు.
కాంగ్రెస్ నాయకుడి నోటి నుంచి ఆర్ఎస్ఎస్ ప్రార్థనాగీతం రావడం అసెంబ్లీలో ఉన్న సభ్యులందరికీ విస్తుపోయేలా చేసింది. ఆ సమయంలో సభలో ఒక క్షణం స్తబ్దత నెలకొంది.
గత వారం ఆర్సీబీ విజయం అనంతరం చిన్నస్వామి స్టేడియం సమీపంలో నిర్వహించిన సంబరాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ప్రతిపక్ష బీజేపీ డీకే శివకుమార్‌పై నేరుగా ఆరోపణలు చేసింది.
ఈ ఆరోపణలకు సమాధానమిస్తూ శివకుమార్ స్పష్టతనిచ్చారు. బెంగళూరు ఇన్‌ఛార్జి మంత్రిగా, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ సభ్యుడిగా కేవలం ఆర్సీబీ జట్టును అభినందించడానికే వెళ్లానని, ప్లేయర్లను కౌగిలించుకుని, కప్‌ను ముద్దాడిన తరువాత తన పని ముగిసిందని తెలిపారు.
అదే సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగాయని, కావాలంటే వాటి జాబితా చదివి వినిపిస్తానని ప్రతిపక్షానికి సమాధానం ఇచ్చారు.