Dk shivakumar: బెంగళూరు నగర రహదారుల దుస్థితిపై బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రేపాయి. ఆమె చేసిన ట్వీట్‌కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు.
“మజుందార్ షా గారు రహదారులను అభివృద్ధి చేయాలనుకుంటే మేము పూర్తి సహకారం అందిస్తాం. అవసరమైతే గుంతలు పూడ్చేందుకు కావలసిన నిధులు కూడా కేటాయిస్తాం” అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బెంగళూరు నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీ స్థాయిలో నిధులు కేటాయించిందని శివకుమార్ పేర్కొన్నారు.
ఇటీవల బయోకాన్ పార్కుకు వచ్చిన ఓ విదేశీ ప్రతినిధి బెంగళూరు రోడ్లపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడంతో తాను ఇబ్బందిపడ్డానని కిరణ్ మజుందార్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆమె పోస్టు వైరల్ కావడంతో నగర రహదారుల పరిస్థితిపై చర్చ మళ్లీ ముదిరింది.
ఇదే అంశంపై గతంలో బ్లాక్‌బక్ సీఈఓ రాజేశ్ యాబాజీ కూడా రోడ్ల పరిస్థితిని విమర్శిస్తూ పోస్టు చేసిన విషయం తెలిసిందే. పారిశ్రామికవేత్తల వరుస వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నేతల నుంచి కూడా స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.