Diwali 2024

Diwali 2024: దీపావళి స్పెషల్ సాంగ్స్.. వెండితెర పంచిన సరాగాల వెలుగులు!

Diwali 2024: దీపాల వెలుగుల రవళి.. టపాసుల సందడి.. పసిడి పూజల సరళి.. సర్వత్రా ఆనంద కేళి.. దీపావళి! దీపాల వరుసలు మిల మిల మెరుస్తూంటే.. సంబరంగా.. సందడిగా ఫటా ఫట్ మంటూ వచ్చే  టపాసుల సవ్వడిలో  గతంలోని చీకటిని తుడిచేస్తూ వెలుగుల మెరుపుల కోసం జరుపుకునే పండుగ దీపావళి. ప్రతి ఇంటా దీపం.. ప్రతి మనసూ ఆనంద తాండవం.  దీపావళి మెరుపుల్లో ,మరుగున పడిపోయే బాధల భారం. దీపావళి అంటే పండగే కాదు.. అంతకు మించి అంటే ఒప్పుకొని వారుండరు కదూ. 

దీపావళి తెచ్చిన  సంబరంతో తడిసి ముద్దవుతున్న మనకి తెలుగు సినిమాలు ఎన్నో వెలుగుల పాటల్ని అందించాయి. ఒక్కో పాట ఆణిముత్యం. దీపావళిలో ఉండే ఆధ్యాత్మిక వెలుగుల్ని కొన్ని చూపిస్తే.. దీవాలీ సంబరాల్లోని మెరుపుల్ని కొన్ని వినిపిస్తాయి. దీపావళి సందర్భంగా మహా న్యూస్ మీకోసం అటువంటి దీపావళి పాటల జావళిని ఒక దగ్గర అందిస్తోంది. మారేందుకు ఆలస్యం టపాసుల సందడి.. దీపాల ఒరవడి మన తెలుగు సినిమాల్లో పాటలుగా ఎలా జాలువారాయో ఓ లుక్కేసేయండి! 

Diwali 2024: చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని… అలాగే వెలుగుకు కూడా చీకటి నేనున్నానని  చెబుతూనే ఉంటుంది… చీకటి వెనుకే వెలుగులు – వెలుగుల వెంటే చీకటి – ఇదే సృష్టిధర్మం… దానిని లోకానికి చాటుతూ సాగే పండుగ దీపావళి… ఇదిగో దీపావళి పండుగ సంబరాల్ని అందంగా మనకు చూపించే పాట. మణిశర్మ సంగీతంలో వచ్చిన స్పెషల్ దీపావళి పాట ఇది.. 

చీకట్లను చీల్చేస్తూ సాగే వెలుగుల పండుగ దీపావళి.. లోకకంటకుడైన నరకుని పీడ వదలగానే విరిసిన ఆనందంలో వెలిసింది దీపావళి… నాటి నుండి నేటి దాకా అందరికీ ఆనందం పంచుతూ సాగుతోంది దీపావళి… దీపావళి పండుగ విశిష్టాన్ని మనకు చెప్పే అలనాటి దీపావళి సినిమా ఇక్కడుంది.. 

Diwali 2024: సరదాలతో సందడి చేసిన దసరా తరువాత సంబరాలు చేస్తూ వస్తుంది దీపావళి… మతాబుల పండుగ వస్తోందంటేనే అందరిలోనూ ఆనందం… ఊరూరా… వాడవాడలా వెలుగులు విరజిమ్ముతూ సాగుతుంది దీపావళి… ఈ పండగ అనగానే నాటి సినీ ఫ్యాన్స్ మదిలో పలు పాటలు చిందులు వేస్తాయి… షావుకారు సినిమాలో దీపావళి పాట ఇప్పటికీ టాప్ సాంగ్.. 

చీకటివెలుగుల్లోనే సాగుతుంది జీవితం… లోకాన్ని చూసే నయనంలోనూ చీకటి, వెలుగు ప్రతీకగా నలుపుతెలుపు… ఇక నయనానందం కలిగించడానికి అమావాస్యనాడు వచ్చే పున్నమి రోజు – దీపావళి…  ‘రామయ్యతండ్రి’లోని “వెన్నెల రోజు… సాంగ్  చూస్తే దీపావళి సంబరాల్లో కిక్కే వేరు. 

ALSO READ  Telangana: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామంలో ఓ ఇంట్లో క్షుద్రపూజల కలకలం

ప్రతి పండుగలో దేవుణ్ణి ఆరాధించడం పరిపాటే..మన పాపాలను తొలగించడానికి దేవుడే దిగివస్తే… అది అసలైన దీపావళే… అలాంటి అసలైన దీపావళిని జరుపుకున్న వారిదే భాగ్యం! ‘షిర్డీ సాయిబాబా మహత్యం’లోని  ఈ పాట అదే చెబుతుంది.. 

దీపావళికి ఆది మన దేశమే… అయినా పరాయి పాలనలో మనకు చీకట్లే… తెల్లవాడు తెప్పలెక్కి వెళ్లిపోగానే అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది… స్వేచ్ఛాభారతంలో తొలి ఆగస్టు 15వ తేదీనే అసలైన దీపావళి సాగింది… ఆనాటి సంబరాల్ని అందంగా విజువలైజ్ చేస్తూ సాగిన  ‘భారతీయుడు’లోని “తెప్పలెల్లిపోయాక…” సాంగ్  ఇదిగో ఇక్కడుంది.. 

Diwali 2024: ఇంటిల్లిపాది కలసి జరుపుకొనే ఏ పండగైనా కళకళలాడుతుంది … ఇక దీపావళి తెచ్చే కళే వేరు… మన ముఖాల్లోనూ, కట్టుకొనే బట్టల్లోనూ కొత్తదనం కనిపిస్తూ వెలిగిపోతుంటాం… దీపావళి రోజున ఆనందనిలయాలు వెలిగిపోయే తీరే వేరబ్బా! మరి ఈ  ‘ఇంటింట దీపావళి’లోని టైటిల్ సాంగ్ చూస్తే మజా వేరే లెవెల్.. 

Diwali 2024: పండగల్లో వరసైన వారిని ఆటపట్టించడంలోనే  మరదులకు, మరదళ్లకూ వినోదం… ఆ సరదాల పరదాల మాటున సాగే వినోదాల విందులే అసలైన దీపావళిని అందిస్తాయి… బావలతో బావమరదుల సయ్యాటలు… వదినలతో మరదళ్ళ సరసాలు- ఇలా సాగే ఆనందావళి అసలైన దీపావళి… ఆ సరదాల ముచ్చట్లను వెండితెరపై పంచిన ఈ  ‘విచిత్రబంధం’లోని “చీకటివెలుగుల రంగేళి…” సాంగ్ ఎవర్  గ్రీన్! 

Diwali 2024: మనమే కాదు, మన చుట్టు పక్కల వారితోనూ కలసి ఆనందంతో అలసిపోయేలా పండగలు చేసుకుంటే అదో తృప్తి… దీపావళి రోజున అలా మతాబులు కాల్చేవారి ఆనందానికి ఆకాశమే హద్దు… వారికి తెలియదు సాగే పొద్దు…  పండగల పూట పడచువాళ్ళ ప్రేమపల్లకి సాగే తీరే వేరు… ప్రేయసినవ్వుల్లో ప్రియునికి దీపావళి… ప్రేమికుని సరసనే ప్రియురాలికి దీపావళి…

కొందరికి ప్రేయసి నవ్వుల్లోనో, కళ్ళల్లోనో దీపాలు కనిపించి, దీపావళి తలపిస్తే – మరికొందరికి ప్రేమించిన వారి దుస్తుల కళలోనూ దీపావళి దర్శనమిస్తూ ఉంటుంది… అలాంటి వారి నోట సాగే పాట సైతం పండగ చేస్తుంది… అలా కుర్రకారుకి రొమాంటిక్ కిక్ ఇచ్చే  ‘పందెంకోడి’లోని “ఓణీ వేసిన దీపావళి…” కచ్చితంగా గిలిగింతలు పెడుతుంది.. 

ప్రేమలో పడ్డవారికి పండగ వేళ కూడా పరధ్యానమే – ఏదీ రుచించదు… ఆకలుండదు… దప్పికుండదు… మరి అలాంటి ప్రేమరోగులకు మందేమిటి!? ప్రియుడి ఆగమనం ప్రియురాలికి మందు… ప్రేయసి సాంగత్యమే ప్రేమికునికి విందు… ఇదిగో అలంటి ఫీలింగ్స్ అన్నగారు ఎన్ఠీఆర్ కి వస్తే ఎలా ఉంటుందో.. దీపావళి సంబరాల్లోని మాస్ మసాలా ఏ రేంజిలో ఉంటుందో  ‘కేడీ నంబర్ వన్’లోని “ఆకలుండదూ…” సాంగ్ లో చూసేయాల్సిందే!

ALSO READ  Team India: వాంఖడేలోనైనా విజయం వరించేనా..!

Diwali 2024: ఎవరికైనా అనుకున్నది సాధిస్తే ఆ ఆనందం అంతా ఇంతా కాదు… ఆ ఆనందం అంబరాన్ని తాకుతూ ఉంటుంది… ఇక సంబరాలకూ కొదువ ఉండదు… అలా మదిని తాకిన ఆనందంతో సాగే సంబరాల్లో దీపావళి చోటు చేసుకోవలసిందే… పేదా గొప్పా తేడా చూడని.. చూపించని దీపావళి సంబరాల్ని ఈ మెగాస్టార్ చిరంజీవి  పాటలో చూసి తీరాల్సిందే! ‘సంఘర్షణ’లోని “సంబరాలో సంబరాలు…”సాంగ్ దీపావళి కాన్సెప్ట్ ని మెగా స్టయిల్ లో చెప్పిన పాట ఇది. 

అతిసన్నిహితులు వచ్చిన వేళ  ఎవరికైనా పండగ రోజే.. ఆ రోజు దీపావళే అయితే ఇక సంతోషం సాగరంతో పోటీ పడక మానదు… ఆ దీపావళే వారికి మరపురానిది – మరువలేనిది కాక మానదు … ‘ముద్దుల మనవరాలు’లోని “ఇన్నాళ్లకొచ్చిందా దీపావళి…” సాంగ్ చూస్తే సరిగ్గా ఆ అనుభూతి కలగక మానదు. 

Diwali 2024: పసిపాపల బోసినవ్వుకు వెల కట్టే షరాబు లేడు… పసిపిల్లల నవ్వులను మించిన దీపాలూ లేవు… దీపాలతో పోటీపడే బాలల ఆనందం నడుమసాగే పండగను మించినది ఏదీ ఉండదు… ఆ ఆనందం అనుభవించాల్సిందే కానీ, మాటల్లో కొలువలేము…ధర్మేంద్ర ‘జుగ్ను’లోని “ఛోటే ఛోటే… నన్నే మున్నే… దీప్ దివాళీ…” సాంగ్ అదే చూపిస్తుంది 

అసలు సిసలు దీపావళి ఎక్కడుంది? మన మనసుల్లోనే దాగుంది… రాజు-పేద తేడాలు సమసిపోయిన రోజు – కులమతాల గోడలు కూలినవేళ – వసుధైక కుటుంబం ఆలోచన వెలిగిన సమయం – అంతా దీపావళే…అదే అచ్చమైన దీపావళి… స్వచ్ఛమైన ఆనందావళి…  ‘మామగారు’లోని “ఈ నాడే అచ్చమైన దీపావళి…” సర్వమానవత్వాన్ని వివరిస్తూ ఇలా వచ్చింది 

చివరిగా.. దీపావళి పండగంటే ఖర్చుతో కూడుకున్నదే… టపాకాయలకు డబ్బు ఖర్చు పెట్టడం వేస్ట్ అనేవారున్నారు… అలా ఖర్చు చేయడమే బెస్ట్ అనుకొనేవారూ ఉన్నారు…ఎవరి టేస్టును బట్టి వారు సాగుతారు… అయితే పండుగ పరమార్ధం సంతోషంగా ఇంటిల్లపాదీ.. ఇరుగుపొరుగు సంబరాలు చేసుకోవడమే. ఆనందాల మతాబుల్ని.. సంతోషాల చిచ్చుబుడ్డుల్ని.. చిమ్మ చీకట్లో వెలుగులు పంచే చిరు దీపాల్లా అందరూ పంచుకోవడమే. ఈ సందడిలో జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తత ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అజాగ్రత్త సంతోషాన్ని చిదిమేసే అవకాశం ఉంది. ఈ దీపావళి అందరికీ మరింత వెలుగులు తేవాలని కోరుకుంటూ మహా న్యూస్ దీపావళి శుభాకాంక్షలు చెబుతోంది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *