Dhulipalla Narendra Kumar: ధూళిపాళ్ల నరేంద్ర కు మంత్రి పదవి దక్కని నేపథ్యంలో చేస్తున్న బలప్రదర్శన అని చెవులు కొరుక్కున్న వారి నోళ్ళు మూత పడేలా నిన్నటి సభలో పొన్నూరు నియోజక వర్గ డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రసంగం సాగింది.
రెవిన్యూ శాఖ మంత్రిగా ఒక వెలుగు వెలిగిన తన తండ్రి దూళిపాళ్ళ వీరయ్య చౌదరి ఓటమి పాలయిన సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు మొదలుకుని, తన తండ్రి అకాల మరణం తరువాత టిక్కెట్టు కోసం చేసిన పోరాటాలు, కక్ష కట్టి పొన్నూరు నియోజకవర్గాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు రాజశేఖర రెడ్డి చేసిన కుటిల యత్నాలను తిప్పికొట్టిన వైనం గురించి, సంగం డెయిరీని హస్తగతం చేసుకునేందుకు జరిగిన ప్రయత్నాల నేపథ్యంలో సహకార వ్యవస్థగా వున్న డైరీని కంపెనీగా మార్చాల్సి వచ్చిన నేపథ్యం గురించి, తప్పుడు కేసులతో జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తనను జైలుపాలు చేసిన సమయంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి, రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటినుండి దేవినేని రమణ, పయ్యావుల కేశవ్, తెలంగాణా ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్ రెడ్డి, వేం నరేంద్ర రెడ్డిలతో సహవాసం, రాజకీయ ప్రయాణం గురించి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఎన్నిక సందర్భంలో జరిగిన హత్య కేసులో తాను, తన తమ్ముడు రవి కుమార్ ముద్దాయులుగా మారిన సంగతుల గురించి, తనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన శ్రేయోభిలాషుల గురించి… అనర్గళంగా, అలవోకగా సాగిన నరేంద్ర అంతరంగ ఆవిష్కరణ అభిమానుల అభిమానాన్ని చూరగొంది.
ఈ సభలో నరేంద్ర చేసిన ఉపన్యాసం రాజకీయ ఉపన్యాసం ఎంతమాత్రం కాదు. అది అరమరికలు లేని దూళిపాళ్ళ నరేంద్ర రాజకీయ ప్రస్థాన విహంగ వీక్షణమే!
ఇది కూడా చదవండి: Seetakka: అల్లు అర్జున్ అరెస్ట్ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
Dhulipalla Narendra Kumar: ప్రతిపక్షంలో వుండగా రేషన్, గ్రావెల్ మాఫియాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన తాను, ఈవేళ అధికారంలోకి వచ్చాక అదే మాఫియాను అనుమతిస్తే అది ఆత్మహత్యా సదృశం అవుతుందని పేర్కొన్న నరేంద్ర, తన తండ్రి నుండి వారసత్వంగా అంది పుచ్చుకున్న నైతిక , వ్యక్తిగత విలువలకు కట్టుబడివున్న తనను సన్నిహితులు కొందరు పాతకాలం మనిషిగా గేలిచేసినా, తను మాత్రం జీవితాంతం ఆ విలువలకే కట్టుబడి ఉంటానని చెప్పటం ద్వారా నరేంద్ర మరోమారు తన నైజాన్ని విస్పష్టంగా ప్రకటించినట్లయుంది.
లోగడ మంత్రి పదవి దక్కకపోవడం పట్ల భాధ పడిన విషయాన్ని శషబిషలు లేకుండా అంగీకరించిన నరేంద్ర, ఈ దఫా కూడా మంత్రి పదవి దక్కకపోవడాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదని వివరించడం ద్వారా అభిమానుల్ని కొంతమేరకు స్వాంతన పరిచినట్లయింది.
ఇది కూడా చదవండి: Lk Advani: ఎల్ కే అద్వానీకి మళ్ళీ అస్వస్థత..
Dhulipalla Narendra Kumar: ఎంతటి కఠిన సమస్య ఎదురైనా సన్నిహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకునే అలవాటు తనకు వుందని వెల్లడించిన నరేంద్ర, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అడుగులు ముందుకు వేయడమే గాని, వెనుదిరిగి చూసింది లేదని తన విజయ రహస్యాన్ని వెల్లడించారు.
తనను అభిమానించి, తన వెంట నడిచిన కార్యకర్తలకు కష్టం వస్తె.. వారికి ముందు నిలిచి నడవడం తన స్వభావమని నరేంద్ర కుమార్ మరోమారు స్పష్టం చేశారు.
మొత్తం మీద తన మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని స్థూలంగా ఆవిష్కరించిన దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ తన అభిమానులు, శ్రేయోభిలాషుల గుండెల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.
ఈరోజు జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కు హృదయ పూర్వక అభినందనలు!… శుభాభినందనలు!

