Dharmavaram CI Mother Murdered

Dharmavaram CI Mother Murdered: విషాదాంతంగా ముగిసిన సీఐ తల్లి మిస్సింగ్ కేసు

Dharmavaram CI Mother Murdered: ఆమె ఓ పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ తల్లి. పది రోజుల కిందట మిస్సింగ్‌ అయింది. సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నేర చరితుడు కావడంతో పోలీసులకు చిక్క కుండా దృశ్యం సినిమా తరహాలో మొబైల్‌ ఫోన్‌, సిమ్‌ ఇంట్లోనే పడేసి పరారయ్యాడు. అంతేకాకుండా విమానాల్లో తిరుగుతూ, జల్సాలు చేశాడు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు సాకేంతిక పరిజ్ఞానంతో ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలోని ధర్మవరం సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. 62 ఏళ్ల స్వర్ణకుమారి హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. తన అనారోగ్య సమస్యలకు స్వామీజీలను నమ్ముకోవడమే ఆమె మృతికి కారణమైంది. నగల కోసం ఇంటిపక్కన ఉన్న వ్యక్తే సీఐ తల్లిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం, అతడిచ్చిన సమాచారం మేరకు స్మశానంలో పూడ్చిపెట్టిన స్వర్ణ కుమారి శవాన్ని వెలికి తీసి అక్కడే పంచనమా నిర్వహించారు.

అమ్మ చెరువు మిట్ట జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి గత నెల 28వ తేదీన అదృశ్యమయ్యారు. దీంతో ఈ నెల 2వ తేదీన స్వర్ణకుమారి బంధువుల మదనపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్వర్ణకుమారి స్మశానంలో శవమై కనిపించారు.

స్వర్ణకుమారిని ఆమె ఇంటి సమీపంలోనే ఉంటున్న వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకటేష్ మృతురాలి ఇంటి సమీపంలోనే నివాసముంటూ చాలా నమ్మకంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీ ఆమెను ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం స్వామీజీ వద్దకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఆ తర్వాత స్వర్ణకుమారి ఇంటికి రాలేదు. దీన్ని గమనించిన స్థానికులు కొంతమంది సమాచారాన్ని మృతురాలి బంధువులకు అందించారు. అనుమానితుడిగా ఉన్న వెంకటేష్ ఊరు వదిలి వెళ్లిపోయాడు. చివరకు పోలీసులు అతన్ని పట్టుకొని సమాచారం రాబట్టారు.

నిందితుడు మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం అయోధ్య నగర్ సమీపంలోని స్మశాన వాటికలో పూడ్చి పెట్టాడు. జరిగిన వ్యవహారం పోలీసులకు నిందితుడు వెంకటేష్ చెప్పి మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పంచనామా నిర్వహించారు. కాగా నిందితుడు వెంకటేష్​తో పాటు మరో నిందితుడు అనిల్ కలసి స్వర్ణ కుమారిని హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

స్వర్ణ కుమారి వద్ద ఉన్న బంగారు నగల కోసమే వీరు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. హత్య జరిగిన మరుసటిరోజే వెంకటేష్ స్వర్ణ కుమార్​కి చెందిన నగలను పట్టణంలోని ఓ బంగారు నగర దుకాణంలో కుదువ పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *