Pawan Kalyan

Pawan Kalyan: నేడు తూ.గో జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గురువారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్‌ ఖరారైంది. మత్స్యకారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, వారికి భరోసా కల్పించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ పర్యటన షెడ్యూల్‌

ఉదయం 8.15 గంటలకు మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి రాజమహేంద్రవరం చేరి, హెలికాప్టర్‌ ద్వారా కాకినాడ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ కు వెళ్తారు.
అనంతరం ఉదయం 10 గంటలకు కాకినాడ కలెక్టరేట్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొని సముద్ర కాలుష్యం, నష్టపరిహారం, చేపల వేటపై ప్రభావం వంటి అంశాలపై చర్చిస్తారు.

మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ముగిసిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ జీఆర్‌టీ హోటల్‌లో విశ్రాంతి తీసుకుని, మధ్యాహ్నం 2.30 వరకు అక్కడే ఉంటారు. అక్కడ జనసేన నాయకులతో సమీక్షా సమావేశం జరగనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Local Body Elections 2025: రెండు విడతల్లో MPTC,ZPTC ఎన్నికలు.. నేడు మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్..

తదుపరి మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పాడ చేరుకుని, 4.10 వరకు ఉప్పాడ సెంటర్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభలో మత్స్యకారులకు భరోసా కల్పిస్తూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వనున్నారు. అనంతరం పవన్‌ కళ్యాణ్‌ హెలికాప్టర్‌లో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు, అక్కడినుంచి గన్నవరం – మంగళగిరి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

కలెక్టరేట్‌లో కఠిన భద్రతా ఏర్పాట్లు

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పర్యటన నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్‌ ప్రాంగణంలో భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పోలీస్‌ బలగాలు మోహరించి, సమావేశానికి వచ్చే ప్రతీ ఒక్కరిని తనిఖీ చేసి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు.
కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం నుంచి వివేకానంద హాల్‌ వరకు ప్రత్యేక లైన్‌ ఏర్పాటు చేయగా, వెనుక ద్వారాలు పూర్తిగా మూసివేశారు. ఎస్‌పీ బిందుమాధవ్‌ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కలెక్టర్‌ షాన మోహన్‌ పర్యవేక్షణ

కాకినాడ కలెక్టర్‌ షాన మోహన్‌ బుధవారం స్వయంగా కలెక్టరేట్‌, వివేకానంద హాల్‌, మరియు ఉప్పాడ సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను తనిఖీ చేశారు. పవన్‌ పర్యటనకు సంబంధించిన సురక్షా, లాజిస్టిక్స్‌ ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఉప్పాడ బహిరంగ సభకు భారీ పోలీసు బందోబస్తు

ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు సుమారు 550మంది పోలీసులు, అధికారులు భద్రతా బాధ్యతలు చేపడుతున్నారు.
ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 12మంది సీఐలు, 30మంది ఎస్‌ఐలు, 10 రోప్‌ పార్టీలు విధుల్లో పాల్గొంటున్నాయి. సభా ప్రాంగణం చుట్టూ అన్ని వైపులా బారికేడ్లు వేసి, బీచ్‌ రోడ్డులో పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు.

మత్స్యకారుల ఆశలు పవన్‌ ప్రసంగంపై

ఉప్పాడ, కొత్తపల్లి ప్రాంత మత్స్యకారులు పవన్‌ కళ్యాణ్‌ పర్యటనపై భారీ ఆశలు పెట్టుకున్నారు. సముద్ర కాలుష్యం వల్ల చేపల వేట దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో, ఆయన ప్రత్యక్షంగా సమస్యలు విని పరిష్కారం సూచిస్తారని మత్స్యకారులు భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *