Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ఐక్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ఐక్యత ఎంతో ముఖ్యమని, రాబోయే మరో 15 ఏళ్లు ఇదే ఐక్యత కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా అందరూ సర్దుకుపోవాలి” అని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. కూటమి ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలు ఫలించాయని ఆయన గుర్తు చేసుకున్నారు.
“ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో ముందుకు వెళ్తోంది” అని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి బలోపేతం అయితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

