Nandini Milk: తిరుపతి లడ్డూ వివాదంతో కర్ణాటక KMF నందిని బ్రాండ్ లాభపడుతుందా? ఇప్పుడు కర్ణాటక మీడియాలో ఈ విషయంపై ప్రత్యేక కథనాలు ఈ ప్రశ్నకు ఔననే జవాబిస్తున్నాయి. తిరుపతి లడ్డూ వివాదం కర్ణాటక కేఎంఎఫ్ నందిని బ్రాండ్‌పై పరోక్షంగా ప్రభావం చూపిస్తుందా? అంటూ కర్ణాటక మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఆ కథనాల ప్రకారం తిరుపతి లడ్డూ వివాదం తర్వాత నందిని పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
Nandini Milk: తిరుపతి లడ్డూ వివాదం తర్వాత కర్ణాటకలోని అన్ని ముజరై ఆలయాల్లో నందిని నెయ్యిని తప్పనిసరిగా వాడాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, అన్ని దేవాలయాల ప్రసాదాలను ప్రయోగశాలల్లో పరీక్షించాలని కూడా సూచించింది. దీంతో నందిని పాలు, పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది.
మరోవైపు కల్తీ నెయ్యి, పాల ఉత్పత్తులపై భయాందోళనలు నెలకొనడంతో నందిని పాలు(Nandini Milk), నందిని ఉత్పత్తులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని తెలుస్తోంది. దీంతో నందిని పాల ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరిగిందని నందిని వర్గాలు చెబుతున్నట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి.
నందిని(Nandini Milk) ఏజెన్సీ కోసం డిమాండ్..
కన్నడ మీడియా కథనాల ప్రకారం నందిని ఏజెన్సీలను ప్రారంభించేందుకు డిమాండ్ పెరిగింది. ఇందుకోసం అప్లై చేసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగిందని బళ్లారి రబకోవి మిల్క్ యూనియన్ ఎండీ పీర్యా నాయక్ మీడియాకు తెలిపారు. ఎంత డిమాండ్ ఉన్నా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు
బళ్లారి మిల్క్ యూనియన్ పరిధిలో ప్రతి రోజు 2.20 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తున్నారు. నందిని నుంచి ప్రతిరోజు 1.50 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తున్నాం. రోజుకు 10 వేల లీటర్ల పెరుగు విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు 500 కిలోల నెయ్యి అమ్మకాలు జరుగుతున్నట్టు పీర్యా నాయక్ తెలిపారు.
ప్రస్తుతం తిరుపతి తిరుమల దేవస్థానం పాలకమండలి కూడా లడ్డూ తయారీకి నందిని నెయ్యిని వినియోగిస్తున్న విషయం తెలిసిందే.