Crime News: దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన తాజా హత్యకేసు కలకలం రేపింది. యూపీఎస్‌సీ అభ్యర్థి రామ్ కేశ్ మీనా హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ అగ్నిప్రమాదమని అని అందరూ అనుకున్నారు. కానీ ఈ ఘటన వెనుక భయంకరమైన ప్రేమ- ప్రతీకార నాటకం దాగి ఉందని ఢిల్లీ పోలీసులు బయటపెట్టారు.
అగ్నిప్రమాదం కాదు… పక్కా ప్రణాళిక
అక్టోబర్ 6న తిమార్‌పూర్‌లోని గాంధీ విహార్ ప్రాంతంలోని నాల్గవ అంతస్తు ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసరికి పూర్తిగా కాలిపోయిన మృతదేహం కనిపించింది. అనంతరం మృతుడిని 32 ఏళ్ల రామ్ కేశ్ మీనాగా గుర్తించారు. మొదట ఇది ప్రమాదమని భావించినా, సీసీటీవీ ఫుటేజ్ చూసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు.
సీసీటీవీ దృశ్యాలు బయటపెట్టిన రహస్యం
ఫుటేజ్‌లో ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు భవనంలోకి ప్రవేశించినట్లు, వారిలో ఒకరు 39 నిమిషాల తరువాత బయటకు వచ్చినట్లు గుర్తించారు. తెల్లవారుజామున 2:57 గంటలకు ఓ మహిళ వారితో కలిసి బయటకు వచ్చిన వెంటనే ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. ఈ అనుమానాస్పద కదలికల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హత్యకు ప్రియురాలే సూత్రధారి
దర్యాప్తులో మృతుడి ప్రియురాలు అమృతా చౌహాన్ (21) పేరు బయటపడింది. ఆమె ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని. రామ్ కేశ్ మీనాతో సహజీవనం చేస్తూ, వ్యక్తిగత వీడియోలు రికార్డ్ చేయబడ్డాయి. ఆ వీడియోలను డిలీట్ చేయమని పలుమార్లు అడిగినా రామ్ కేశ్ నిరాకరించాడని అమృతా తెలిపింది. దాంతో ఆమె తన మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్ (27), అతని స్నేహితుడు సందీప్ కుమార్ (29) సహాయంతో హత్యకు పథకం వేసింది.
ఇది కూడా చదవండి: Montha Cyclone: మరో 24 గంటలు రెడ్ అలర్ట్ జారీ.. 65 రైళ్లు రద్దు..
దారుణ హత్య తర్వాత అగ్నిప్రమాదం నాటకం
అక్టోబర్ 6 రాత్రి ముగ్గురూ ఫ్లాట్‌లోకి వెళ్లి రామ్ కేశ్ గొంతు కోసి చంపారు. తర్వాత మృతదేహంపై నూనె, నెయ్యి, వైన్ చల్లి నిప్పంటించారు. సిలిండర్ రెగ్యులేటర్ తెరిచి గ్యాస్ లీక్ అయ్యేలా చేసి ఫ్లాట్ తలుపు వేసి వెళ్లిపోయారు. ఇలా అగ్నిప్రమాదంలా కనిపించేలా నాటకం ఆడారు.
పోలీసుల కచ్చితమైన దర్యాప్తు
ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డులు, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ముగ్గురూ ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ప్రాంతానికి చెందిన వారని గుర్తించారు. వారిని అక్కడ అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు.
హత్య వెనుక కారణం — భయం, ప్రతీకారం
దర్యాప్తులో అమృతా ఒప్పుకున్న విషయాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. రామ్ కేశ్ వద్ద తన వ్యక్తిగత వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్‌ను డిలీట్ చేయకపోవడంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు ఆమె చెప్పింది. హత్యకు కారణమైన ఆ హార్డ్ డిస్క్‌తో పాటు ఇతర సాక్ష్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

