Delhi: వరకట్న వేధింపుల కేసుల్లో నిందితుడి కుటుంబ సభ్యులందరినీ విచారణలోకి తీసుకోవడం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులను, అంతకుమించి సంబంధిత వ్యక్తులను కూడా కేసులో ఇరికించేందుకు ప్రయత్నించడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.
గెడ్డం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం అనే కేసులో, భర్త, అతని కుటుంబ సభ్యులతో పాటు అత్త చెల్లెలు, ఆమె కుమారుడిని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే, అత్త చెల్లెలు, ఆమె కుమారుడిపై కేసును కొట్టివేయాలని కోరుతూ వారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించడంతో, వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు.
విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, వారి మీద వేధింపుల ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు లేవని, వారిపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసింది. అలాగే, ఇలాంటి కేసుల్లో నిందితుడి కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని అనవసరంగా కేసుల్లో ఇరికించాలనే ధోరణి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే, కేసులో ప్రధాన నిందితుడైన బాధితురాలి భర్తపై విచారణను భువనగిరి ట్రయల్ కోర్టు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా కుటుంబ సభ్యులందరినీ విచారణలోకి తీసుకోవడం తగదని తేల్చిచెప్పింది.