Delhi Car Blast: ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు దాడి కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ మొహమ్మద్ పేరుపై మరో కారు కూడా రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
సోమవారం జరిగిన ఈ దాడికి ఉమర్ నబీ హ్యుందాయ్ ఐ20 కారును ఉపయోగించాడు. ఆ కారులో పేలుడు పదార్థాలను నింపి దాడి చేయగా, ఈ ఘటనలో 9 మంది మరణించారు. దాంతో పాటు పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో, పోలీసులు ఇప్పుడు ఉగ్రవాది పేరు మీద ఉన్న రెండో కారు కోసం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఉమర్ నబీ మొహమ్మద్ పేరుపై ఉన్న రెండో కారు ఎరుపు రంగులో ఉండే ఫోర్డ్ ఎకోస్పోర్ట్. ఈ కారు నెంబర్ DL10CK0458 అని పోలీసులు గుర్తించారు. ఈ కారుకు ఉమర్ నబీ రెండో యజమాని.
ఈ ఎరుపు రంగు ఎకోస్పోర్ట్ కారు ఎక్కడ కనిపించినా వెంటనే అడ్డగించాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులు అన్ని ఏజెన్సీలు, అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, పెట్రోలింగ్ మరియు పికెట్‌లో ఉన్న సిబ్బంది అంతా అప్రమత్తంగా, పూర్తిగా ఆయుధాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏదైనా సీసీటీవీ ఫుటేజీలో ఈ అనుమానాస్పద కారు కనిపించినా, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

