Crude Oil Rates: ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా చమురు ఉత్పత్తి పెరుగుతుందన్న ఒపెక్+ దేశాల ప్రకటనతో మార్కెట్‌లో చమురు ధరలు నాలుగేళ్ల కనిష్ఠానికి చేరాయి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం 60.23 డాలర్లకు పడిపోయింది. ఇది 2024తో పోలిస్తే దాదాపు 20 డాలర్ల తక్కువగా ఉండడం విశేషం.
ఈ తగ్గుదలతో భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఊరట కలగనుంది. దేశీయంగా వాడే ముడి చమురులో 85 శాతాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడి చమురు దిగుమతులకు 242.4 బిలియన్ డాలర్లు (రూ. 20.6 లక్షల కోట్లు) ఖర్చు చేసింది. అదేవిధంగా, ద్రవ సహజవాయు (LNG) కోసం 15.2 బిలియన్ డాలర్లు (రూ. 1.3 లక్షల కోట్లు) వెచ్చించింది.
రేటింగ్ సంస్థ ICRA అంచనా ప్రకారం, ఇప్పుడు ధరలు తగ్గడం వల్ల ముడి చమురు దిగుమతులపై దేశానికి దాదాపు రూ. 1.8 లక్షల కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉంది. అలాగే, LNG దిగుమతులపై రూ. 6 వేల కోట్ల వరకు ఆదా చేయవచ్చని చెబుతోంది. చమురు కంపెనీలకు కూడా ఈ పరిణామం లాభదాయకమవుతుందని, వాటి లాభాలు మెరుగవుతాయని తెలిపింది.
Also Read: Pawan Kalyan: కుక్కల్లా అరవకండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్
Crude Oil Rates: దేశీయ చమురు మార్కెట్‌కు ఇది మంచి సంకేతంగా భావిస్తున్నాయి. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గింపు వచ్చిన తర్వాత ఇంధన ధరల్లో పెద్దగా మార్పు లేదు. కానీ ఇప్పుడు ముడి చమురు ధరలు తగ్గడంతో, త్వరలోనే పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గుదల సాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా, డీజిల్ ధర రూ.95.69గా ఉంది. చమురు ధరలు ఇదేలా కొనసాగితే వినియోగదారులకు త్వరలోనే ఊరట దక్కే అవకాశం ఉంది.