Nitish Kumar Reddy: ఐపిఎల్ ..బిసిసిఐ మానస పుత్రిక.. బోర్డులకు కాసుల వర్షం కురిపించడమే కాదు.. ఎందరో క్రికెటర్ల జీవితాలు మలుపు తిప్పుతోంది. అనామకులుగా ఐపిఎల్ లో అడుగుపెట్టి.. ఆశ్చర్యపరిచే ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిలోపడి.అక్కడ సత్తాచాటిన అనంతరం టీమిండియాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్ల ప్రదర్శనకు వేదికగా మారింది. తాజాగా ఐపీఎల్ లో అదరగొట్టి ఆనక టీమిండియాలో చోటు పట్టి ..ఆల్ రౌండర్ గా అదరగొట్టి ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో తలపడే అవకాశాన్ని దక్కించుకున్నాడు తెలుగు తేజం నితీశ్ రెడ్డి. పేస్ ఆల్ రౌండర్ గా అద్భుత ప్రతిభతో జట్టులో సుస్థిర స్థానం దిశగా సాగుతున్నాడు.
నితీశ్ కుమార్ రెడ్డి సంచలన ప్రయాణం ప్రారంభమైన కేవలం ఏడున్నర నెలల్లో మొత్తం మారిపోయింది.. ఐపిఎల్ లో అదరగొట్టి టీమిండియాలో చోటు దక్కించుకున్న తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి.. ఇప్పుడు బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో టెస్టుల్లోకి అరంగేట్రం చేసాడు. 2024 ఏప్రిల్ 5.. నితీశ్ కుమార్ రెడ్డి అనే యంగ్ గన్ ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డెబ్యూ చేశాడు. అప్పటివరకు భారత క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ పేరు పరిచయమే లేదు. తొలి మ్యాచ్‌లో అతను అంతగా ఆడింది లేదు. కానీ ఏడున్నర నెలల్లో కథ మారింది. 2024 నవంబరు 22.. అదే కుర్రాడు ఇప్పుడు ప్రతిష్ఠాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పిచ్ ల్లో ఒకటి పెర్త్ లో ని వాకా గ్రౌండ్ లో టెస్టు ఆడే తుది జాబితాలో చోటు చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: AUS vs IND: బూమ్..బూమ్..బుమ్రా.. వాకా గ్రౌండ్ లో 5 వికెట్ల ప్రదర్శన
Nitish Kumar Reddy: పేస్ ఆల్‌రౌండర్‌గా తుది జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి మీద జట్టు మేనేజ్ మెంట్ కు అపార నమ్మకముంది. అలాగే అందరూ ఊహించినట్లుగా పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 41 పరుగులు చేశాడు. భారత టాపార్డర్ లో యశస్వి జైస్వాల్, కింగ్ కోహ్లీ ఆడలేక పోయిన వేళ..వికెట్లు టపటపా పడిన సమయంలో కొత్త కుర్రాడు నితీశ్ బరిలోకి దిగి సత్తా చాటాడు. అద్భుతమైన షాట్లతో ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చాటాడు. ప్రపంచంలోనే టాప్ బౌర్లు కమిన్స్, స్టార్క్, హేజిల్ వుడ్ ల బౌలింగ్ ను ఎదుర్కొని ధాటిగా ఆడాడు. ఏమాత్రం భయం లేకుండా ఫియర్ లెస్ షాట్లతో టెస్టుల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.
పెర్త్ టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి విలువైన ఇన్నింగ్స్ ఆడడంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేయగలిగింది. ఈ అవకాశాన్ని సిరీస్ ఆసాంతం సద్వినియోగం చేసుకుంటే నితీశ్ కెరీర్ ఇంకా గొప్ప మలుపు తిరగడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. అనామకుడిగా అదరగొట్టి ఆశ్చర్యపరిచే ప్రదర్శన చేయడం నితీశ్ కు అలవాటే. అతను ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేశాడు. తన తొలి మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ టీమ్.. నితీశ్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. నాలుగో మ్యాచ్‌లో ఆడిస్తే 14 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత మ్యాచ్‌లో అతడి సత్తా ప్రపంచానికి తెలిసింది. పంజాబ్ కింగ్స్ జట్టుపై 37 బంతుల్లో 64 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడడమే కాదు.. బౌలింగ్ లోనూ రాణించి ఒక వికెట్ కూడా తీసి తన విలువ చాటి చెప్పాడు.
ఈ సీజన్ ఆసాంతం బ్యాటుతో రాణించిన నితీశ్ రెడ్డి 303 పరుగులు చేశాడు. 3 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ ప్రదర్శన సెలక్టర్లను ఆకట్టుకోవడంతో అతడికి టీమిండియాలోచోటు తెచ్చిపెట్టింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో తుది జట్టులో ఆడే అవకాశం దక్కించుకున్న నితీశ్.. ఢిల్లీలో జరిగిన రెండో టీ20లో 74 పరుగులు చేయడమే కాక.. 2 వికెట్లు కూడా తీశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో సత్తా చాటడంతో నితీశ్‌కు టెస్టు జట్టులోనూ చోటు దక్కింది. ఇది మామూలు అవకాశం కాదు. అతను ఎంపికైంది ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి. అయితే జట్టులో చోటిచ్చారు కానీ.. ఇలాంటి పెద్ద సిరీస్‌లో తుది జట్టులో వెంటనే ఛాన్స్ దొరకడం కష్టం అనుకున్నారు. కానీ నెట్ సెషన్లలో నితీశ్ బౌలింగ్, బ్యాటింగ్‌కు ఇంప్రెస్ అయిన టీమ్ మేనేజ్‌మెంట్ నేరుగా తొలి మ్యాచ్ నుంచే అతడిని తుది జట్టులో ఆడించాలని నిర్ణయించింది. దీంతో పెర్త్‌లో అతడి అరంగేట్రం జరిగింది.
ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ ఆడడం అంటే అరుదైన అవకాశం. ఐపీఎల్ కెరీర్ మొదలుపెట్టిన ఏడున్నర నెలల్లో నితీశ్ ఈ అద్భుత అవకాశాన్ని పట్టేశాడు. ఇక్కడ సత్తా చాటితే ప్రపంచంలో ఎక్కడైనా తిరుగుండదని అంటారు విశ్లేషకులు. సిరీస్‌లో అతడికి ఆస్ట్రేలియా బౌలర్లు, బ్యాటర్ల నుంచి కఠిన సవాలు ఎదురవడం ఖాయం. ఆస్ట్రేలియాలో ఎంతో అనుభవం ఉన్న బ్యాటర్లు అయినా తడబడతారు. అందుకే నితీశ్ ఆచితూచి ఆడాల్సిందే. ఇప్పటివరకు అతను టీ20ల్లో విధ్వంసంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడతను ఆచితూచి ఆడడం ద్వారా టెస్టులకూ తాను సరిపోయే బ్యాటర్‌నే అని చాటిచెప్పాలి. ప్రస్తుతం కొంత బలహీనంగా కనిపిస్తున్న భారత మిడిలార్డర్‌ను బలోపేతం చేయాల్సిన బాధ్యత నితీశ్ మీద ఉంది.
ఇది కూడా చదవండి: Vaibhav Suryavanshi: కుర్రాడే కానీ.. ఐపీఎల్ మెగా వేలంలో మెరుస్తున్నాడు!
Nitish Kumar Reddy: వికెట్ల పతనాన్ని అడ్డుకోవడం.. లోయరార్డర్ బ్యాటర్లతో భాగస్వామ్యాలు నెలకొల్పి స్కోరు పెంచడం అతడి బాధ్యత. అంతే కాదు ఆస్ట్రేలియా వికెట్ల మీద బంతి వేగంగా దూసుకెళ్తుంది. బౌన్స్ కూడా ఉంటుంది. నితీశ్ లాంటి మీడియం పేసర్లు కూడా ఇక్కడ ప్రభావం చూపగలరు. ప్రధాన పేసర్ల మీద భారాన్ని తగ్గించేలా అతను మధ్యమధ్యలో ఫిలప్ ఓవర్లు వేయడమే కాదు.. సమయానుకూలంగా వికెట్లు కూడా పడగొడితే జట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఆల్‌రౌండర్ జట్టులో ఉంటే ఒక అదనపు బ్యాటర్ లేదా బౌలర్‌ను తుది జట్టులోకి తీసుకునే సౌలభ్యం ఉంటుంది.
కాబట్టి నితీశ్ ఆల్ రౌండర్‌గా సత్తా చాటి తన ఎంపికకు న్యాయం చేస్తే జట్టులో అతడి స్థానం సుస్థిరమవుతుంది. కపిల్ దేవ్ తర్వాత సరైన ఆల్‌రౌండర్ లేని లోటును హార్దిక్ పాండ్య భర్తీ చేస్తాడనుకుంటే.. టెస్టుల్లో అతను నిలకడగా రాణించలేకపోయాడు. మరి నితీశ్ అయినా ఆ లోటును భర్తీ చేస్తాడేమో చూడాలి. గతంలోనూ సెలక్టర్ల దృష్టిలోపడి.. అంతర్జాతీయ స్థాయిలో మేటి క్రికెటర్లుగా ఎదిగిన కుర్రాళ్ల జాబితా పెద్దదే. రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా రిషబ్ పంత్.. ఇలా చాలామందే ఐపీఎల్‌తో అంతర్జాతీయ స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా అదే బాటలో పయనించేలా కనిపిస్తున్నాడు.