Vaibhav Suryavanshi: బీహార్‌కు చెందిన 13 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన పేరును ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంలో నమోదు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో పాల్గొన్న అతని పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వయసులో ఇంతటి ఘనత చూపించిన అతనిపై క్రికెట్ ప్రేమికుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.వైభవ్ క్రికెట్ ప్రయాణం ప్రత్యేకమైనది. 2011లో బీహార్‌లోని తాజ్ పుర్ గ్రామంలో జన్మించిన అతను నాలుగేళ్ల వయసులోనే బ్యాట్ పట్టుకున్నాడు. తన కొడుకు క్రికెట్‌లో ప్రత్యేక ప్రతిభను గమనించిన తండ్రి సంజీవ్ సూర్యవంశీ,
శిక్షణ కోసం ప్రత్యేక మైదానం ఏర్పాటు చేశారు. ఎనిమిదేళ్లకే సమస్తిపూర్ క్రికెట్ అకాడమీలో చేర్పించి, శిక్షణ పొందేలా చూసుకున్నారు. రెండు సంవత్సరాల్లోనే వైభవ్ అండర్-16 జట్టులో చోటు సంపాదించాడు, అదే సమయంలో అతని వయసు కేవలం పదేళ్లు మాత్రమే కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Sanju Samson: సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాల్సిందే..
Vaibhav Suryavanshi: లెఫ్ట్ హ్యాండర్‌గా వైభవ్ తన ఆటలో దూకుడు చూపిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ప్రతిభ చూపిస్తున్న అతను, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఏడాది ఆరంగేట్రం చేసి ఐదు మ్యాచ్‌లు ఆడాడు. ముఖ్యంగా ఓపెనింగ్‌లో అతని ధాటిగా ఆడే విధానం ప్రత్యేక ఆకర్షణ. బౌండరీల కోసం ఎదురుచూడకుండా ఫీల్డింగ్ సెటప్‌ను తనకు అనుకూలంగా మార్చుకునే కసితో ఆడే అతని ఆటతీరును చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారు.
ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్ పేరును చేర్చడంతో క్రికెట్ ప్రపంచంలో చర్చ మొదలైంది. అతన్ని ఎవరైనా ఫ్రాంచైజీ ఎంపిక చేస్తే, అది సంచలనానికి దారి తీస్తుందని భావిస్తున్నారు. 16 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన తర్వాత ఇలాంటి సంచలనం ఇప్పుడు వైభవ్ రూపంలో మళ్లీ పునరావృతమవుతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ వయసులోనే ఇంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్న వైభవ్ ప్రతిభను గుర్తించి ఐపీఎల్‌లోకి తీసుకుంటే, భారత క్రికెట్‌లో ఒక ప్రత్యేక అధ్యాయం ప్రారంభమైనట్టే. అతని విజయయాత్రను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.