Siddipet: ఆస్తి ఆశ మనుషులను ఎంతకైనా దిగజారుస్తుంది. కన్నప్రేమను, మానవత్వాన్ని మర్చిపోయేలా చేస్తుంది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటనే దీనికి నిదర్శనం. ఆస్తి కోసం సొంత తల్లిని అత్యంత కిరాతకంగా చంపింది ఓ కూతురు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
ఏం జరిగిందంటే..
సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన బాల నర్సయ్య, బాలమణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు నవనీతకు పెళ్లి చేసి అల్లుడు మధును ఇల్లరికం తెచ్చుకున్నారు.
ఇటీవల తల్లి బాలమణి.. పెద్ద కూతురు లావణ్యకు అర ఎకరం భూమి ఇస్తానని చిన్న కూతురు నవనీతకు చెప్పింది. ఇది వినగానే నవనీత మనసులో దురాశ పెరిగింది. తల్లి బతికుంటే ఆస్తిలో కొంత భాగం అక్కకు పోతుందని, తల్లిని అడ్డు తొలగిస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని ప్లాన్ వేసింది.
హత్యకు పథకం:
నవనీత తెలివిగా అప్పుల విషయంలో ఇరుక్కున్న గౌరయ్య అనే వ్యక్తిని కలుపుకుంది. బాలమణి నుంచి గౌరయ్య రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తల్లిని చంపితే, అప్పు తీర్చాల్సిన అవసరం లేదని నవనీత.. గౌరయ్యతో ఒప్పందం చేసుకుంది.
Also Read: Crime News: రీల్స్ పిచ్చి అతని ప్రాణాలమీదికి తెచ్చింది
తల్లిని చంపిన తీరు:
ఈ నెల 10వ తేదీ రాత్రి తల్లి బాలమణి పడుకున్న తర్వాత నవనీత, ఆమె భర్త మధు, గౌరయ్య కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. బాలమణి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు.
నాటకం ఆడిన కూతురు:
హత్య చేసిన తర్వాత, నిందితులు మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, తునికి బొల్లారం చెరువులో పడేశారు. ఆ తర్వాత, తమ నేరం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు, పెద్ద కూతురు లావణ్యపై అనుమానం వచ్చేలా చేయాలని అనుకున్నారు. అంతేకాదు, చిన్న కూతురు నవనీత ఎవరికీ తెలియని విధంగా తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
పోలీసుల దర్యాప్తులో నిజం:
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ నెల 16వ తేదీన బాలమణి మృతదేహం కుళ్ళిన స్థితిలో చెరువులో దొరికింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా, చిన్న కూతురు నవనీత, అల్లుడు మధు, గౌరయ్యలు నిజం ఒప్పుకున్నారు. ఆస్తి కోసమే తల్లిని చంపినట్లు తేలింది.
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఆస్తి కోసం కన్నతల్లినే చంపడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.